Assam Road Accident : అసోం తింసుకియా జిల్లాలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ట్రక్కు- టాటా మ్యాజిక్ ఢీ కొన్న ఈ ఘటనలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తింసుకియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని అక్కడి నుంచి.. రాత్రికి రాత్రే దిబ్రూగఢ్‌లోని అసోం మెడికల్ కాలేజ్‌కు తీసుకెళ్లారు.
ఇదీ జరిగింది..
ధీరక్ సొంజన్ గ్రామానికి చెందిన కొంత మంది.. మంగళవారం జిల్లాలోని దుందుమ వారాంతపు మార్కెట్‌కు వెళ్లారు. వీరంతా తిరిగి ఇంటికి వస్తుండగా.. అరుణాచల్ ప్రదేశ్ నుంచి వస్తున్న ట్రక్కు.. వీరు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్‌ను పత్తార్ సమీపంలో రాత్రి 10.30 గంటల సమయంలో ఢీకొట్టింది. ట్రక్కు డ్రైవర్ అతిగా మద్యం సేవించి వాహనం నడపడమే.. ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. అయితే ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. అధికారులు వెంటనే స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని స్థానికులు వాపోయారు. కాగా మృతి చెందిన వారిని బింతియా, బరుహా, రీనా గొగోయ్, మిహిధర్ నియోగ్, పబేన్ మారన్, కులాయ్ మెష్, పల్లవి దహోతియాగా గుర్తించారు. గాయపడిన వారిని అతుల్ గొగోయ్, భురంజిత్ మారన్, జొనాలి మారన్, బికాశ్ నియోగ్, గోలేశ్వర్ మారన్, మోనో మారన్, యశోద మారన్, లక్ష్మిమణి మారన్, ఎలిటా మారన్, పింకి మారన్‌గా అధికారులు గుర్తించారు.