అసోం కరీమ్‌గంజ్ జిల్లాలో ఓ భాజపా అభ్యర్థి వాహనంలో ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రం(ఈవీఎం) బయటపడటం తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. గురువారం పోలింగ్ పూర్తైన తర్వాత.. ఈవీఎంను సదరు భాజపా అభ్యర్థికి చెందిన వాహనంలో తరలించడాన్ని ఇతర పార్టీల కార్యకర్తలు గుర్తించి వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో ఓ దశలో గాల్లోకి కాల్పులు కూడా జరిపారు.
ఏం జరిగిందంటే?
రతబరి నియోజకవర్గ పరిధిలోని ఇందిరా ఎంవీ పాఠశాల పోలింగ్ కేంద్రం నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్‌కు తరలించే క్రమంలో వాహనం పాడవడం వల్ల.. ఓ ప్రైవేటు కారును ఆపి అందులో తరలించారు. అయితే.. ఆ వాహనం భాజపా సిట్టింగ్ ఎమ్మెల్యే పాథర్‌కాంది కృష్ణేందు పాల్ పేరు మీద ఉండడం యాదృచ్ఛికమేనని అధికారులు వివరణ ఇచ్చారు. ఏఐడీయూఎఫ్, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వాహనంపై దాడికి దిగారని తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దిన అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
రీపోలింగ్..
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది ఎన్నికల సంఘం. ఇందుకు కారణమైన ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి సహా.. మరో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ ఈవీఎంపై తొలుత సీల్ చేసిన ముద్రలు చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ.. సదరు నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
భాజపాపై విరుచుకుపడ్డ ప్రియాంక..