అసోంలోని స్వయంప్రతిపత్తి ప్రాంతం బోడోల్యాండ్ ప్రాదేశిక మండలి పీఠాన్ని.. ఈసారి భాజపా, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్(యూపీపీఎల్), గాన సురక్ష పార్టీ(జీఎస్పీ) కూటమి అధిష్ఠించనుంది.
రాష్ట్రప్రభుత్వంలో భాగంగా ఉన్న బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్)ను భాజపా పక్కనపెట్టింది. కూటమిగా ఉన్న భాజపా, బీపీఎఫ్ ఈసారి బీటీసీ ఎన్నికల్లో వేర్వేరుగా బరిలో నిలిచాయి. ప్రచారంలో ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. 40 స్థానాలకు గానూ 17 చోట్ల గెలుపొంది బీపీఎఫ్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. యూపీపీఎల్కు 12 దక్కగా.. కాంగ్రెస్, జీఎస్పీ తలో సీటు నెగ్గింది.
చివరిసారి భాజపాకు ఒకే సీటు దక్కగా ఈసారి ఏకంగా 9 చోట్ల గెలుపొందింది. అప్పుడే.. కొత్త కూటమిపై ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇదీ చూడండి:'బోడో' ఎన్నికల ఫలితాల్లో హంగ్- పుంజుకున్న భాజపా!
విజ్ఞప్తి చేసినా...
ఫలితాలు వెలువడిన అనంతరం.. కూటమి నిబంధనలు పాటించాలని భాజపాకు విజ్ఞప్తి చేశారు బీపీఎఫ్ అధ్యక్షుడు, 17 ఏళ్లుగా బీటీసీ అధిపతిగా ఉన్న హగ్రామా మొహిలరీ. బీటీసీలో అధికారం చేపట్టేందుకు సహకరించాలని కోరారు. అయితే.. అవేమీ పట్టించుకోని భాజపా యూపీపీఎల్ను అభినందిస్తూ, ఆ పార్టీని తన సంకీర్ణ భాగస్వామిగా పేర్కొంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్లు చేశారు.
''ఈశాన్య ప్రజలకు సేవ చేసేందుకు ఎన్డీఏ కట్టుబడి ఉంది. బీటీసీ ఎన్నికల్లో మెజార్టీ సాధించినందుకు మా సంకీర్ణ భాగస్వామి యూపీపీఎల్, అసోం భాజపాకు అభినందనలు. వారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారు. ఎన్డీఏపై విశ్వాసం ఉంచినందుకు అసోం ప్రజలకు కృతజ్ఞతలు.''
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి