assam police station fire: అసోం నగావ్ జిల్లాలో పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించిన ఘటనలో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో కారకులైన ఐదు కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. ఈ కేసుకు సంబంధించి 20 మందిని అదుపులోకి తీసుకున్నామని డీఐజీ సత్యరాజ్ హజారికా తెలిపారు. ఇందులో నలుగురు మహిళలు ఉన్నారని.. దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. సఫీకుల్ ఇస్లాం మృతి కేసులో.. దోషులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామన్నారు డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత. దర్యాప్తు సజావుగా సాగుతుందని.. బటద్రవా స్టేషన్ ఇంచార్జ్‌ను సైతం సస్పెండ్ చేసినట్లు చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు నిప్పటించడం లాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మృతుడి బంధువుల్లో అనేక మందికి క్రిమినల్ రికార్డులు ఉన్నాయని చెప్పారు.
Nagaon Police Station Fire: అసోం నగావ్ జిల్లాలోని బటద్రవా పోలీస్ స్టేషన్‌కు గుర్తుతెలియని దుండగులు శనివారం నిప్పంటించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి సఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తిని బటద్రవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రూ. 10వేలు లంచంగా ఇస్తే విడిచి పెడతామని చెబుతూ కుటుంబ సభ్యుల ముందే సఫీకుల్‌ను పోలీసులు కొట్టినట్లు స్థానికులు ఆరోపించారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన సఫీకుల్ కుటుంబం తిరిగి పదివేల రూపాయలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లగా.. అప్పటికే అతడ్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారని పేర్కొన్నారు.