అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణకు సంబంధించి మిజోరం రాజ్యసభ ఎంపీ వన్లాల్వేనాపై అసోం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల హత్య కుట్రలో ఈ ఎంపీ కీలక పాత్ర పోషించినట్లు ఆయన అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో వన్లాల్వేనా దాడికి సంబంధించిన సంకేతాలిచ్చారని వెల్లడించారు. ఈయనపై చట్టబద్ధంగా చర్య తీసుకోవడానికి పోలీసులు, సీఐడీ అధికారులు దిల్లీకి బయలుదేరనున్నట్లు స్పష్టం చేశారు. మిజోరం పోలీసులు, పౌరులు అసోం పోలీసులపై జరిపిన దాడికి సంబంధించిన ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దాడి జరిపిన వారి సమాచారం తెలిపిన వాళ్లకు రూ.5 లక్షల రివార్డ్‌ను సైతం ప్రకటించారు.
అసోం మిజోరాం సరిహద్దులోని లైలాపూర్ వద్ద ఘర్షణ జరిగింది. మిజోరాం వైపు నుంచి కొంతమంది అసోం పరిధిలోని ప్రాంతాలను ఆక్రమించేందుకు వచ్చినవారిని అసోం పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో కర్రలు, రాళ్లు, అధునాతన ఆయుధాలను చేతబట్టిన మిజోరం బృందం.. అసోం పోలీసులపై దాడి చేసింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి, బాష్ప వాయుగోళాలు ప్రయోగించారు. మిజోరం వైపు నుంచి జరిగిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మరణించారు. 70 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.