అసోం నాగావ్ జిల్లాలో(Assam Nagaon News) దారుణ ఘటన వెలుగు చూసింది. అశ్లీల వీడియోలు చూసేందుకు నిరాకరించిన ఓ ఆరేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అతికిరాతకంగా హత్య చేశారు. పూర్తి దర్యాప్తు అనంతరం ఈ కేసులో సదరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరాన్ని దాచేందుకు యత్నించిన కారణంగా.. వారిలో ఒకరి తండ్రిని కూడా అరెస్టు చేశారు.
రాళ్లతో కొట్టి..
"నాగావ్ జిల్లాలోని (Assam Nagaon News) కలియాబోర్కు చెందిన ఈ ముగ్గురు నిందితులు.. తరచూ అశ్లీల వీడియోలు చూస్తుంటారు. మంగళవారం మధ్యాహ్నం తమతో ఆ వీడియోలను చూడాలని బాధిత బాలికను ఒత్తిడి చేశారు. కానీ, ఆమె నిరాకరించింది. దీంతో ముగ్గురూ కలిసి ఆమెను రాళ్లతో కొట్టి హత్యచేశారు" అని పోలీసులు తెలిపారు.
"ఇదో దురదృష్టకర ఘటన. ఇద్దరు 11 ఏళ్ల బాలురు, ఒక 8 ఏళ్ల వయసు బాలుడు కలిసి.. ఆరేళ్ల చిన్నారిని హత్య చేశారు. అశ్లీల వీడియోలు చూసేందుకు నిరాకరించడం వల్లే వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ నేరం గురించి తెలిసి కూడా దాన్ని దాచేందుకు యత్నించిన కారణంగా నిందితుల్లో ఒకరి తండ్రిని కూడా అరెస్టు చేశాం."