అసోం-మిజోరం సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో తటస్థ కేంద్ర బలగాలు మోహరింపునకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బారువా, డీజీపీ భాస్కర్ జ్యోతి మహతా, మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్‌మవియా చౌంగో, డీజీపీ ఎస్‌బీకే సింగ్‌లతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా దిల్లీలో బుధవారం సమావేశమయ్యారు. రెండు గంటలకుపైగా సాగిన ఈ భేటీలో వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో 306వ నంబరు జాతీయ రహదారి వెంట తటస్థ కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (సీఏపీఎఫ్) మోహరించేందుకు అంగీకారం కుదిరింది.
ఈ సాయుధ సిబ్బందికి సీఏపీఎఫ్‌లోని సీనియర్ అధికారి నేతృత్వం వహిస్తారు. ఇందుకోసం కేంద్ర హోం మంత్రిత్వశాఖ సమన్వయంతో రెండు రాష్ట్రాలు సముచితమైన సమయంలోగా అవసరమైన ఏర్పాట్లు చేస్తాయి. భేటీ అనంతరం మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతం ప్రశాంతంగా ఉందని, రాష్ట్ర బలగాలను ఆ ప్రాంతం నుంచి ఉపసంహరిస్తామని చెప్పారు. అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర సరిహద్దు బాధ్యతలను సీఏపీఎఫ్ చేపట్టనుందని తెలిపారు. సరిహద్దు సమస్య సామరస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాలు పరస్పర గౌరవంతో చర్చలు జరపాలని భేటీ సందర్భంగా అజయ్ భల్లా సూచించినట్లు అధికారులు చెప్పారు. సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.