Mob lynching Assam: అత్యాచారం, హత్య, దొంగతనం వంటి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కొట్టి చంపారు కొందరు స్థానికులు. ఈ ఘటన అసోంలోని లఖింపుర్లో గురువారం జరిగింది. రెండు రోజుల క్రితం గెర్జాయ్ బారువా అలియాస్ రాజు బారువా కోర్టు నుంచి తప్పించుకున్నాడు. అనంతరం అతడు ఘిలామార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిలకిలి గ్రామంలోని ఓ వాగు వద్ద దాక్కున్నాడు. దీంతో కొంత మంది కలిసి అతడిపై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బారువాపై దాడి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కొందరు నిందితుడ్ని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన నిందితుడ్ని.. స్థానికుల నుంచి కాపాడే ప్రయత్నం చేశారు పోలీసులు. ఆవేశంతో ఉన్న వారు.. ఇద్దరు పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డారు.
నిందితుడు రాజు బారువాను ధాకుఖానా సివిల్ ఆసుపత్రికి తరలించాం. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. స్థానికుల దాడిలో గాయపడిన ఇద్దరు పోలీసులను మెరుగైన చికిత్స కోసం లఖింపుర్ తరలించాం. నిందితుడిపై గత 15 ఏళ్లుగా దొంగతనం, దోపీడీ, అత్యాచారం, హత్య కేసులు పలు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. బారువాతో పాటు మరో ఇద్దరు నిందితులు మంగళవారం ధాకుఖానా కోర్టు నుంచి తప్పించుకున్నారు. వారి కోసం ముమ్మరంగా గాలించి ఒకరిని అరెస్టు చేశాం. మరొకరి కోసం వెతుకుతున్నాం.