Assam flood deaths: అసోంలో వరద పరిస్థితులు రోజురోజుకూ మరింత క్షీణిస్తున్నాయి. ఆదివారం మరో ఆరుగురు వరదల ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.2 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారని వెల్లడించారు. మొత్తం 22 జిల్లాలో వరద ముంపునకు గురయ్యాయని పేర్కొన్నారు. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వివరాల ప్రకారం నాగావ్ జిల్లా కాంపుర్ రెవెన్యూ సర్కిల్లో నలుగురు నీట మునిగి చనిపోయారు. కాచర్, హోజాయ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వరదకు బలయ్యారు. ఈ మరణాలతో రాష్ట్రంలో వరద మృతుల సంఖ్య 24కు పెరిగింది.
Assam floods death toll: మొత్తంంగా 7,19,540 మంది ప్రజలు వరదకు ప్రభావితమయ్యారని విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది. నాగావ్ జిల్లాలోనే 3.46 లక్షల మంది ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం 2 వేలకు పైగా గ్రామాలు నీటి ముంపులో ఉన్నాయని, 95 వేల హెక్టార్లకు పైగా పంట ధ్వంసమైందని వివరించింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారులను పునరుద్ధరించే దిశగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చర్యలు చేపట్టారు. జాతీయ రహదారుల అథారిటీ ఛైర్పర్సన్ అల్కా ఉపాధ్యాయతో చర్చలు జరిపారు. రహదారులకు వెంటనే మరమ్మత్తులు చేయాలని కోరినట్లు సీఎం పేర్కొన్నారు.