దేశంలో ఆసక్తి రేపిన 5 అసెంబ్లీల ఎన్నికల్లో భాజపాకు పట్టు నిలబెట్టిన రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో భాజపా, మిత్రపక్షాలతో కలిసి మరోసారి విజయఢంకా మోగించింది. రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను అధికారం చేపట్టడానికి అవసరమైన సంఖ్యాబలం 64.. కడపటి వార్తలందేసరికి భాజపా, దాని మిత్రపక్షాలతో కలిసి 75 స్థానాల్లో పట్టు (గెలుపు/ఆధిక్యం) సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి 50 స్థానాల్లోను.. ఇతరుల్లో ఒకరు సత్తా చాటారు.
కమల దళహాసం
సీఏఏ ఆందోళనలు తదితర అంశాలతో మొదట ప్రచారంలో తడబడ్డా భాజపా ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకుంది. అస్సాంలో భాజపా 60 స్థానాల్లో పట్టు సాధించగా దాని మిత్రపక్షాలైన అసోం గణపరిషత్ (ఏజీపీ), యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్ (యూపీపీఎల్)లతో కలిసి మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.
కలిసిరాని 'హస్త'వాసి!
అస్సాంలో ఒకప్పుడు తిరుగులేని పార్టీగా ఉంటూ.. ఎన్నో దఫాలుగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు మరోసారి నిరాశే మిగిలింది. సొంతంగా ఆ పార్టీ 29 స్థానాల్లో మాత్రమే పట్టు నిలుపుకొంది. ఈ ఎన్నికల్లో ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీఓపీఎఫ్), సీపీఎంలతో కలిసి బరిలోకి దిగింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 26 స్థానాలు మాత్రమే దక్కగా ఈసారి స్వల్పంగా పెరగడమే ఆ పార్టీకి ఊరట. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నప్పటికీ పార్టీని అధికారంలో నిలబెట్టలేకపోయారు.