కరోనా వైరస్‌లో కొత్త రకాలు పుట్టుకొస్తున్న వేళ.. ఒకే వ్యక్తికి రెండు వేరియంట్లు సోకిన ఘటన భారత్‌లో వెలుగుచూసింది. అసోంలోని ఓ వైద్యురాలు ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడినట్లు పరీక్షల్లో నిర్ధరణ అయింది. వైద్య నిపుణుల అంచనా ప్రకారం ఇది తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు.
"ఆమె నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా.. ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకినట్లు గుర్తించాం. ఈ డబుల్ ఇన్ఫెక్షన్‌పై స్పష్టత కోసం మరోసారి నమూనాలను సేకరించి, పరీక్షించాం. ఆమె ఒకే సమయంలో రెండు వేరియంట్ల బారినపడినట్లు నిర్ధరించుకున్నాం. మొదట ఆమె భర్త ఆల్ఫా వేరియంట్ బారినపడ్డారు."
-విశ్వజ్యోతి బొర్కాకొటి, ఐసీఎంఆర్ అధికారి