తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కారును ఢీకొట్టిన ట్రక్కు.. ప్రమాదంలో అసోం 'లేడీ సింగం' మృతి - Assam Road Accident Lady Singham SI Died

Assam Lady Singham : అసోంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 'లేడీ సింగం'గా పిలిచే మహిళా ఎస్​ఐ జున్మోని రభా మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారును భారీ కంటైనర్​ మంగళవారం ఢీకొట్టింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచింది.

Assam And UP Road Accident SI And Several Died
కారు రోడ్డు ప్రమాదం.. అసోం 'లేడీ సింగం'పోలీస్​ మృతి!

By

Published : May 16, 2023, 9:47 PM IST

Assam Lady Singham : అసోం పోలీస్​ విభాగం​లో 'లేడీ సింగం'గా పేరు తెచ్చుకున్న మహిళా ఎస్​ఐ జున్మోని రభా మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని నాగావ్ జిల్లాలోని సరుభుగియా గ్రామ సమీపంలో కంటైనర్ ట్రక్కు​ ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జున్మోని రభా ప్రాణాలు విడిచిందని వైద్యులు ధ్రువీకరించారు. ఎస్​ఐ అకాల మరణంపై ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. సహోద్యోగులు ఆవేదనను వ్యక్తం చేశారు. కాగా, ప్రమాదానికి కారణమైన ట్రక్కును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జున్మోని రభా మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో పోలీస్​ యూనిఫాంలో కాకుండా సాధారణ దుస్తుల్లో వ్యక్తిగత పనుల కోసం తన ప్రైవేటు వాహనంలో ఒంటరిగా బయలుదేరిందని జఖలబంధ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ పవన్ కలిత తెలిపారు. అప్పుడు ఆమె వెంట ఎటువంటి సెక్యురిటీ లేదని చెప్పారు. ఈ క్రమంలో ఆమె వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆయన వివరించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్​ ఉత్తర్​ప్రదేశ్​ నుంచి వస్తుందని.. కారును ఢీ కొన్న వెంటనే డ్రైవర్​ అక్కడి నుంచి పరారయ్యాడని వెల్లడించారు.

'లేడీ సింగమ్'​ అని ఇందుకే అంటారు!
జున్మోని రభా పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. మోరికోలాంగ్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రభా.. నేరస్థుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించేవారు. అంతేకాకుండా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. గత ఏడాది జూన్‌లో ఆమె అవినీతికి పాల్పడిందనే ఆరోపణలపై అరెస్టు అయ్యారు. దీంతో ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించి సస్పెన్షన్ వేటు వేసింది మజులీ జిల్లా కోర్టు. కొద్దిరోజులకు ఆమె సస్పెన్షన్​ వేటు ఎత్తివేయడం వల్ల మళ్లీ తిరిగి విధుల్లో చేరారు. 2022 జనవరిలో బిహ్‌పురియా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్‌తో ఆమె జరిపిన ఫోన్​ సంభాషణ లీక్​ వ్యవహారం అసోంలో తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ వ్యవహారంపై ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఘాటుగా స్పందించారు. ఓ ప్రజాప్రతినిధికి తగిన గౌరవం ఇవ్వాలని హిమంత బిశ్వ శర్మ జున్మోని రభాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వరుస వివాదాల్లో ఓ పోలీస్​ ఆఫీసర్ చిక్కుకోవడం వల్ల ఆమెను 'దబాంగ్​ కాప్​'గా పిలిచేవారు ప్రజలు.

పాల ట్యాంకర్ ఢీకొని 9 మంది దుర్మరణం!
UP Fatherpur Road Accident : ఉత్తర్​ప్రదేశ్​ ఫతేపుర్‌లోని జెహనాబాద్ ప్రాంతంలో ఆటో- పాల ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులంతా కాన్పుర్‌లోని ఘతంపుర్‌కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ప్రమాదం సమయంలో ఆటోలో 11 మంది ప్రయాణస్తున్నట్లు తెలిపారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్​ డ్రైవర్​ను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ప్రధాని, సీఎం సంతాపం!
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.​ మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చూడాలని అధికారులను సీఎం యోగి ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details