దేశంలోని వివిధ వర్గాలకు చెందిన 150 మంది ముస్లిం ప్రముఖులను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం కలిశారు. జనాభా పెరుగుదల అనేది అభివృద్ధికి విఘాతంగా మారుతుందని వీరంతా అంగీకరించారని హిమంత పేర్కొన్నారు. సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన.. అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చేలా ఈ 150 మందితో ఎనిమిది బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
"రచయితలు, వైద్యులు, కళాకారులు, చరిత్రకారులు, ప్రొఫెసర్లు వంటి.. 150 మందికి పైగా మేధావులతో సమావేశమయ్యాను. అసోం మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మేం చర్చించాం. అసోంలోని కొన్ని ప్రాంతాల్లో జనాభా పెరుగుతుండటం వల్ల.. అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. భారత్లోని ఉత్తమ ఐదు రాష్ట్రాల్లో అసోం నిలవాలంటే.. ముందుగా జనాభా విస్పోటంపై దృష్టిసారించాలి. ఈ విషయాలను సమావేశంలో పాల్గొన్నవారు అంగీకరించారు."
-హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం