తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాల్య వివాహాలపై పోలీసులు ఉక్కుపాదం.. తల్లిదండ్రులను అరెస్ట్​ చేస్తారనే భయంతో మహిళ ఆత్మహత్య - Assam Child Marriage Cases Woman Suicide

అమ్మనాన్నలను కాపాడాలనే ఉద్దేశంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తనకు బాల్యవివాహం చేసినందుకు తల్లిదండ్రులను అరెస్ట్​ చేస్తారనే భయంతో ప్రాణాలు తీసుకుంది. అసోంలో ఈ ఘటన జరిగింది. మరోవైపు, బాలికలను వివాహం చేసుకున్న 2,258 మందిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ అరెస్టులపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

assam-child-marriage-crackdown-woman-suicide
అస్సాం బాల్య వివాహాల కేసులు మహిళ ఆత్మహత్య

By

Published : Feb 5, 2023, 9:35 AM IST

Updated : Feb 5, 2023, 10:15 AM IST

తనకు బాల్యవివాహం చేసినందుకు తల్లిదండ్రులను అరెస్ట్​ చేస్తారనే భయంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అమ్మనాన్నలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అసోంకు చెందిన ఖుష్బూ బేగం అనే మహిళ శనివారం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. రాష్ట్ర పోలీసులు గత కొద్ది రోజులుగా బాలికలను వివాహం చేసుకున్న వారిని అరెస్ట్​ చేస్తున్నారు. ఇప్పటి వరకు 2,258 మందిని అరెస్ట్​ చేశారు. మరి కొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అసోం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీసులు ఈ అరెస్ట్​లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. తన తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్​ చేస్తారనే భయంతోనే ఖుష్బూ ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. మంకాచార్‌ జిల్లాలోని ఝౌడాంగ్ పబెర్ గ్రామంలో ఖుష్బూ బేగం నివాసం ఉంటోంది. 12 ఏళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు. ఇప్పుడు ఖుష్బూకు 22 ఏళ్లు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 2019లో కొవిడ్​తో భర్త చనిపోయాడు. ఇప్పుడు తల్లి చనిపోవడం వల్ల.. పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

'మూడేళ్ల వరకు ఆగదు!'
జనవరి 23న రాష్ట్ర క్యాబినెట్​ నిర్ణయం మేరకు గత రెండు రోజులుగా పోలీసులు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అరెస్ట్​లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8వేలమందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వీరిపై పోక్సో, బాల్య వివాహాల నియంత్రణ చట్టం ప్రకారం కేసులు పెడుతున్నారు. ఆపరేషన్‌ మరో మూడేళ్లు కొనసాగుతుందని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు బాల్యవివాహాలను లేకుండా చేయడమే లక్ష్యమన్నారు.

అసోంలో ఇప్పటివరకు 4వేల బాల్యవివాహాల కేసులు నమోదయ్యాయి. వీటిలో 8వేలమంది నిందితులుగా ఉన్నారు. అందులో తల్లిదండ్రులను మినహాయిస్తే మిగిలిన వారి అరెస్టుల సంఖ్య 3వేల 500లకు చేరుతుందని అసోం సీఎం వివరించారు. ముస్లింవర్గంలో పిల్లలకు పెళ్లిళ్లు చేసే కాజీలను నియంత్రించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ దురాచారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అసోం సీఎం సూచించారు. 14ఏళ్ల లోపున్న బాలికలను పెళ్లి చేసుకుంటే పోక్సో చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 18ఏళ్ల లోపున్న బాలికలను వివాహం చేసుకుంటే బాల్య వివాహాల నియంత్రణ చట్టం ప్రకారం కేసులు పెడుతున్నట్లు వివరించారు. భర్త వయసు 14ఏళ్లలోపు ఉంటే అతనిని రిఫామ్‌ హౌస్‌కు పంపుతామని అసోం సీఎం తెలిపారు.

అసోంలో మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా ఉండటం, వివాహాల్లో 31శాతం బాలికలవే ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా బాల్యవివాహాలు చేసుకున్న భర్తలను అరెస్టు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భార్యలు పోలీసు స్టేషన్లలో బారులు తీరుతున్నారు. తమ భర్తలను విడిచిపెట్టాలని ప్రాధేయ పడుతున్నారు. పనిచేసేవారు లేకపోతే పూటగడవడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Last Updated : Feb 5, 2023, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details