అసోంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు భారీ స్థాయిలో నగదు, మద్యం, బంగారం అక్రమ రవాణాను పట్టుకున్నామని అసోం ఎన్నికల సంఘం తెలిపింది. రూ.8.8 కోట్ల విలువైన నగదు, రూ.7.68 కోట్ల విలువైన మద్యం, రూ.1.46 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది.
హెరాయిన్, గంజాయి, బ్రౌన్ షుగర్ వంటి మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నామని అసోం ప్రధాన ఎన్నికల అధికారి నితిన్ ఖాడే తెలిపారు. వీటి మార్కెట్ విలువ రూ.10.18 కోట్లు ఉంటుందని చెప్పారు. ఇవేగాకుండా.. విదేశీ సిగరెట్లు, గసగసాలు, నిషేధిత మాత్రలనూ జప్తు చేశామని చెప్పారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 11 మధ్య స్వాధీనం చేసుకున్న ఈ మొత్తం వస్తువుల విలువ రూ.31.81 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు.