అసోం రాజకీయాలు మరోసారి తేయాకు తోటల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు తేయాకు తోటల్లో ఓట్ల వేట సాగిస్తున్నాయి. తేయాకు తోటల్లో పనిచేసే లక్షలాది మంది కూలీలు 40 నియోజకవర్గాల్లో పార్టీల జయాపజయాలను ప్రభావితం చేయనున్నారు. అసోం రాష్ట్ర జనాభాలో తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు 17 శాతం వరకు ఉంటారు. అందుకే ఎన్నికల వేళ అన్ని పార్టీలు వారి చుట్టూ చక్కర్లు కొడుతూ హామీల వర్షం కురిపిస్తున్నాయి.
కాంగ్రెస్ తరఫున ఇటీవల అసోంలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తేయాకు తోటల్ని సందర్శించారు. అక్కడి కూలీలతో ముచ్చటించారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. కాసేపు వారితో కలిసి తేయాకు కూడా కోశారు.
హామీలు గాలికి..
తేయాకు తోటల్లో పనిచేస్తున్న లక్షలాది మంది తమ దినసరి కూలీ పెంచాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూలీ పెంపుపై హామీలు ఇచ్చే పార్టీలు.. అధికారం చేపట్టాక తమను పట్టించుకోవడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండా, వాన, చలిని లెక్కచేయకుండా పనిచేసినా కూడా కడుపునిండా భోజనం చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. అత్యంత వెనకబాటు జీవితాలను వెల్లదీస్తున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలతో బతుకుబండిని లాగేదెలా అని ప్రశ్నిస్తున్నారు. పనిచేస్తూ కూడా పస్తులుండాల్సిన దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు కన్నీరు పెట్టుకుంటున్నారు.