RRB Exam Scam Protests: ఆర్ఆర్బీ పరీక్షల్లో 'అక్రమాల'పై బిహార్‌లో జరుగుతున్న నిరసనలు మూడో రోజు హింసాత్మకంగా మారాయి. గయాలో రైలు పట్టాలపై ఆందోళనలు చేపట్టిన ఉద్యోగార్థుల్లో కొందరు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఆందోళనల్లో భాగంగా గయా జంక్షన్లో ఆందోళనకారులు గుమిగూడారు. రైల్వే బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భాభువా-పట్నా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పంటించారు. అయితే రైలులో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటన సమయంలో రైలు యార్డ్‌లో పార్కు చేసి ఉందని, కొందరు దుండగులు దానికి నిప్పంటించారని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో రాజేశ్ కుమార్ తెలిపారు. కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రైల్వే మంత్రి స్పందన
బిహార్ సహా ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్‌లో అభ్యర్థుల ఆందోళనలపై రైల్వే మంత్రి అశ్వని వైశ్ణవ్ స్పందించారు. ఉద్యోగార్థులు సంయమనం పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ ఆస్తుల్ని మీరే ధ్వంసం చేసుకోద్దని యువతకు సూచించారు. ఆర్ఆర్బీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తామని, అభ్యర్థుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ ఫిర్యాదులను అధికారికంగా రైల్వే బోర్డుకు సమర్పించాలని పేర్కొన్నారు.
" అభ్యర్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు లేవనెత్తిన విషయాలను తీవ్రంగా పరిశీలిస్తాం. అభ్యర్థుల ఇబ్బందుల గురించి తెలుసుకోవాలని ఆర్ఆర్బీ ఛైర్మన్‌కు సూచించాం. దీనిపై నివేదిక రూపొందించి కమిటీకి అందించాలని చెప్పాం. ఫిర్యాదుల కోసం ఓ ఈమెయిల్ అడ్రస్‌ను ఏర్పాటు చేశాం. కమిటీ దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అభ్యర్థుల సమస్యల గురించి తెలుసుకుంటుంది. "
-అశ్వని వైష్ణవ్, రైల్వే మంత్రి
ఎన్టీపీసీ, లెవెల్ 1 పరీక్ష వాయిదా..