ఉత్తర్‌ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో(Uttar Pradesh Greater Noida) ఓ వ్యక్తి దుస్సాహసం చేశాడు. కారు పత్రాలు చూపించాలని, ఆపిన ఓ ట్రాఫిక్ పోలీసునే(Traffic Police Kidnapped) అపహరించాడు. పది కిలోమీటర్ల దూరం కారులో కానిస్టేబుల్‌ను తీసుకెళ్లి వదిలేశాడు. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
అసలేం జరిగిందంటే..?
గ్రేటర్ నోయిడా పరిధిలోని ఘోది బచేదా గ్రామానికి చెందిన సచిన్ రావల్.. హరియాణా గుడ్‌గావ్‌లోని ఓ కారు షోరూం నుంచి మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారును రెండేళ్ల క్రితం దొంగిలించాడు. టెస్ట్ డ్రైవ్ చేస్తానని షోరూం నిర్వాహుకులను నమ్మించి కారుతో సహా పరారయ్యాడు. తన గ్రామానికే చెందిన మరో వ్యక్తి కారు నంబర్‌తో నకిలీ నంబర్ ప్లేట్ చేయించి, దొంగిలించిన కారును అతడు నడుపుతున్నాడు.
ఆదివారం ఉదయం.. సూరజ్‌పుర్‌లో ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ క్యాంపెయిన్ ఏర్పాటు చేశారు. అక్కడ రావల్ కారును పోలీసులు ఆపారు. అతడ్ని కారు పత్రాలు చూపించాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ అడిగాడు. అయితే.. తన మొబైల్ ఫోన్లో వాటి సాఫ్ట్ కాపీస్ ఉన్నాయని రావల్ చెప్పాడు. వాటిని చూసేందుకు కారులోకి ఎక్కాలని కానిస్టేబుల్‌ను కోరాడు. కారులోకి ఎక్కిన వెంటనే.. కారు డోర్లు లాక్ చేసి, అతడు దూసుకెళ్లాడు(Traffic Police Kidnapped). అజయాబ్పుర్ పోలీస్ చౌకి ప్రాంతంలో వీరేంద్ర సింగ్‌ను దింపేసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు వివరించారు.