భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభనపై అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్ మధ్య మాటల పోరు తీవ్రమవుతోంది. భారత భూగాన్ని చైనాకు మోదీ అప్పంగించారని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై భాజపా కౌంటర్ ఇచ్చింది. రాహుల్ భారత భద్రతా బలగాల త్యాగాలను అప్రతిష్ఠపాలు చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించింది. 43,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు కాంగ్రెస్ అప్పగించిన ఘటనను భారతీయులు ఎన్నటికీ మర్చిపోరని పేర్కొంది.
"నైతిక మనస్సాక్షి లేని వ్యక్తులు.. అబద్ధాలను ఆశ్రయిస్తారు. రాహుల్ ఎడమ, కుడి, మధ్యస్థ అబద్ధాలు ఆడుతున్నారు. బహుశా ప్రధాని పదవినీ చేపట్టలేకపోయానన్న ఆవేదనలో ఆయన ఉండి ఉంటారు. తన నీడ కూడా తనను నమ్మదని ఆయనకూ తెలుసు. ప్రధాని మోదీకి ప్రజల నుంచి లభిస్తున్న మద్దతును రాహుల్ జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రధాని మోదీ గురించి రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తోంటే ఆయన మానసిక ఆరోగ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నాయోమోనని అనిపిస్తోంది.
భద్రతా దళాల త్యాగాలను విస్మరిస్తూ మీరు ఎవరిని సమర్థిస్తున్నారు? ఎందుకు సమర్థిస్తున్నారు? ఎందుకంటే.. మీ పార్టీకి కొంత విరాళం అందింది. చైనీయులతో మీ సమావేశాన్ని మరచిపోలేము. దేశ సార్వభౌమత్వంపై మీ హయాంలో పదేపదే జరిగిన దాడులకు చరిత్ర సాక్ష్యంగా నిలిచింది"
--ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రి
'అందుకు సంతోషం'
మాజీ ప్రదాన మంత్రి నెహ్రూనే హిమాలయాల్లో సమస్యను సృషించారని కాంగ్రెస్ అంగీకరిస్తున్నందుకు సంతోషంగా ఉందని భాజపా ప్రధాన కార్యదర్శి సీటీ రవి.. ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. చైనాకు 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని మాజీ ప్రధాని నెహ్రూ అప్పగించారని ఆరోపించారు. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.