Liquid mirror telescope Uttarakhand: దేశంలో తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోపు ఉత్తరాఖండ్‌లో ఏర్పాటైంది. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ సంస్థ.. నైనితాల్ కొండ ప్రాంతంలోని దేవస్థల్ అబ్జర్వేటరీ వద్ద ఈ టెలిస్కోపును ఏర్పాటు చేసింది. ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోపుగా (ఐఎల్ఎంటీ) పిలుస్తున్న ఈ పరికరం.. ఆస్టరాయిడ్లు, సూపర్నోవాలతో పాటు అంతరిక్ష వ్యర్థాలపై పరిశీలన చేస్తుంది. ఆసియాలో అతిపెద్ద మిర్రర్ టెలిస్కోపుగా ఇది నిలవనుంది. ప్రపంచంలో ఇలాంటి టెలిస్కోపులు కొన్ని మాత్రమే ప్రయోగించారు. అవన్నీ సైనిక అవసరాలు, లేదా శాటిలైట్లపై కన్నేసి ఉంచేందుకు ఉపయోగించారు. ప్రపంచంలో ఖగోళ పరిశోధనల కోసం ప్రయోగించిన తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోపు ఇదే కావడం విశేషం.
liquid mirror telescope facts: ఇలాంటి పరికరాల ఏర్పాటు వల్ల యువత సైన్స్‌కు ఆకర్షితులవుతారని ఏఆర్ఐఈఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ దీపాంకర్ బెనర్జీ అన్నారు. పూర్తిగా ఖగోళ పరిశోధనలకే ఈ టెలిస్కోపును ఉపయోగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేవస్థల్ అబ్జర్వేటరీలో 4 మీటర్ల టెలిస్కోపులు రెండు ఉన్నాయని చెప్పారు. నూతనంగా ఏర్పాటైన లిక్విడ్ మిర్రర్ టెలిస్కోపుతో పాటు, దేవస్థల్ ఆప్టికల్ టెలిస్కోపు ఇక్కడ ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద అపార్చర్ కలిగిన టెలిస్కోపులు ఇవే కావడం విశేషం. హిమాలయాల్లో 2,450 మీటర్ల ఎత్తైన ప్రాంతంలో లిక్విడ్ టెలిస్కోపును ఏర్పాటు చేశారు. ఈ టెలిస్కోపును ఉపయోగించి అక్టోబర్ నుంచి శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అడ్వాన్స్డ్ మెకానికల్ అండ్ ఆప్టికల్ సిస్టమ్స్ కార్పొరేషన్, బెల్జియంకు చెందిన సెంటర్ స్పేషియల్ డి లీజ్ సంస్థలు కలిసి ఈ టెలిస్కోపును డిజైన్ చేశాయి. కెనడా, బెల్జియం దేశాలు దీని ఏర్పాటుకు కావాల్సిన నిధులు సమకూర్చాయి. టెలిస్కోపు నిర్వహణ బాధ్యతలు భారత్‌పై ఉంటాయి.