సరదాగా చేసిన పని.. కొద్ది రోజుల తర్వాత హాబీగా మారింది. దానికోసం ఏకంగా ఉద్యోగానికే రిటైర్మెంట్ ఇచ్చేశారు ఓ పోలీస్ అధికారి. ఇప్పుడు ఆయన ఆలోచనలకు, చేతలకు సరైన వేగం దొరికింది. ప్రయాణంతో ప్రపంచాన్ని చుట్టేద్దాం అన్న ఆయన ఆకాంక్షకు ఇప్పుడు అడ్డంకులేం లేవు.
వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్‌గఢ్ ధమ్తరీ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో 34 ఏళ్ల క్రితం కానిస్టేబుల్‌గా జాయిన్ అయ్యారు సంజయ్. ఇప్పుడు ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు బైక్ రైడ్ చేయడం అంటే ఇష్టం. సెలవులు దొరికినప్పుడల్లా తన బైక్‌తో గోవా, పూరీ లాంటి ప్రదేశాలకు వెళ్లేవాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కావడం వల్ల కొన్నిసార్లు ఆయనకు టైం కుదిరేది కాదు. అలాంటప్పుడు తనకు నచ్చిన బైక్ రైడింగ్ చేయడానికి వీలు దొరకలేదు. దీంతో ఇంకా ఏడేళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు సంజయ్.
అయితే, తాను తరచూ ప్రయాణాలు చేస్తానని తెలిపారు. గోవా నుంచి ధమ్తరీ వరకు బైక్ మీద 24 గంటల్లో వెళ్లానని.. ఇలాంటివి ఇప్పుడు ఎన్నో చేయాలనుకుంటున్నానని అన్నారు. 'లద్దాక్ వరకు బైక్‌పై వెళ్లి.. ఆ తరువాత దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించాలనేదే నా లక్ష్యం' అని తెలిపారు. అయితే ఇటువంటి సుదూరమైన, సాహసోపేతమైన ప్రయాణాలకు లాంగ్ లీవ్ దొరకడం కష్టమని, అందుకే ఉద్యోగం వదిలేసి తన అభిరుచి వైపు వెళ్తున్నానని ఈ పోలీస్ రైడర్ చెప్పుకొచ్చారు.
"పోలీసుల్లో ఉండి కూడా అడ్వెంచర్ చేయొచ్చు. కానీ పోలీస్ అనేది ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగం. దీనివల్ల అది దెబ్బతింటుంది. మీరు నిజంగా అడ్వెంచర్ చేయాలనుకుంటే చేయండి. కానీ రెండూ కలిపి చేస్తానంటే కుదరదు. ఇప్పటివరకు నేను గోవా, నాలుగు సార్లు పూరీ వెళ్లాను. ఫ్యామిలీతో కారులో భారత్ యాత్ర చేశాను. కానీ ఇప్పుడు సోలోగా యాత్ర చేస్తాను. 34 ఏళ్లు సర్వీసు చేశాను. అయితే, ఉద్యోగంతో పాటు మన జీవితాన్ని మనం జీవించడం కూడా ముఖ్యమే అనిపించింది. ఇంట్లో నన్నూ ఎవరూ ఆపరు. నా భార్య నాకు మోటివేషన్ ఇస్తుంది. దాని వల్లనే ఇది చేయగలుగుతున్నా"