పిల్లలు మంచి స్థాయికి ఎదిగినప్పుడు తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదు. వారి కలలను సాకారం చేయడానికి ఆ కుటుంబం ఎంతో కష్టపడుతుంది. ఆ కలలు నిజమవుతున్న సమయంలో ఆ కష్టాలన్నీ మరిచిపోయి.. పిల్లల ఘనతను చూసి తల్లిదండ్రులు పొంగిపోతారు. ఇదే తరహాలో ఝార్ఖండ్‌లోని ఓ కుటుంబం ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలుతోంది.. కానీ ఇంకా ఆ కుటుంబం కష్టాల ఊబిలోనే చిక్కుకుంది.
ఫిఫా లాంటి ప్రతిష్ఠాత్మక గేమ్స్‌లో అండర్-17 బాలికల టీమ్‌కు సారథ్యం వహిస్తున్న అష్టమ్ ఒరాన్ ఝార్ఖండ్‌లోని గుమ్లా అనే ఓ మారుమూల ప్రాంతానికి చెందిన బాలిక. తల్లిదండ్రులు కూలీపని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. గంజి నీళ్లతోనే కడుపు నింపుకునే స్థితిలో ఉన్నప్పటికీ తన కుమార్తె కల నెరవేరాలని ఆ తల్లిదండ్రులు ఆశించారు. రోజువారీ కూలీకి వెళ్లి ఆ వచ్చిన సంపాదనతోనే కుటుంబాన్ని పోషించారు. చిన్నప్పటి నుంచే కష్టాలకు అలవాటు పడిన అష్టమ్ పట్టుదలగా ఫుట్‌బాల్ నేర్చుకుంది.
ఇప్పుడు అష్టమ్ పేరు దేశమంతా మారుమోగిపోతోంది. ఎంతోమంది ప్రముఖులు సైతం ఆమెను ప్రశంసిస్తున్నారు. సరైన దారి లేని ఆ ప్రాంతానికి ఓ మంచి రోడ్డు సైతం ప్రభుత్వం నిర్మిస్తోంది. తన ఆటను చూసేందుకు ఆ కుటుంబసభ్యులకు ఓ టీవీతో పాటు ఇన్వర్టర్ను సైతం అధికారులు అందజేశారు. కానీ ఇందులో హృదయ విదారకమైన విషయం ఏంటంటే.. ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో పొట్ట నింపుకునేందుకు అష్టమ్ తల్లిదండ్రులే కూలీలుగా పని చేస్తున్నారు.