Ashok Gehlot vs Sachin Pilot : రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఏర్పడిన వర్గ పోరుకు ముగింపు పలికేందుకు ఆ పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే దిల్లీ నుంచి హైకమాండ్ పిలుపు మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సమవేశమయ్యారు. ఈ భేటీ సుమారు నాలుగు గంటల పాటు జరిగినట్లు తెలుస్తోంది.
"వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. రాజస్థాన్ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటాం. అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ ఇద్దరూ ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. మాది బీజేపీపై ఉమ్మడి పోరు. రాజస్థాన్‌లో మళ్లీ అధికారం మాదే" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అశోక్ గహ్లోత్ Gehlot Pilot Meet : సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంటికి ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వెళ్లారు. ఆ తర్వాత రాహుల్ అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత ఇద్దరితో గహ్లోత్ భేటీ అయినట్లు తెలిసింది. రాత్రి 8 గంటల సమయంలో సచిన్ పైలట్.. రాహుల్, ఖర్గేతో సమావేశమయ్యారు. చాలా నెలల తర్వాత హైకమాండ్ సమక్షంలో అశోక్ గహ్లోత్- సచిన్ పైలట్ ముఖాముఖి సమావేశం ఇదే కావడం గమనార్హం.
Rajasthan Ashok Gehlot : అంతకుముందు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విలేకరులతో మాట్లాడారు. "నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్‌లో ఏ నాయకుడైనా ఏదైనా డిమాండ్ చేస్తే.. పార్టీ హైకమాండ్ ఆ పదవిని ఇచ్చే సంప్రదాయం లేదు. అలాంటి ఫార్ములా గురించి మేము ఎప్పుడూ వినలేదు. కాంగ్రెస్‌లో ఇప్పటి వరకు ఇలాంటివి జరగలేదు. భవిష్యత్తులో కూడా జరగదు. కాంగ్రెస్ హైకమాండ్ చాలా బలంగా ఉంది. ఏ నాయకుడికీ, కార్యకర్తకూ పదవులు డిమాండ్ చేసే ధైర్యం లేదు" అని గహ్లోత్ వ్యాఖ్యానించారు.
Rajasthan Political Crisis : 2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి గహ్లోత్, పైలట్ మధ్య అధికార పోరు కొనసాగుతోంది. 2020 జులైలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న పైలట్.. మరో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి గహ్లోత్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. అధిష్ఠానం జోక్యంతో ఆ సంక్షోభానికి తెరపడింది. ఆ తర్వాత పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి తొలగించారు.
ఇటీవలే గత బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ప్రభుత్వ ఉద్యోగుల నియామక పరీక్ష పత్రాల లీకేజీ అంశాలపై 15 రోజుల్లోగా చర్యలు చేపట్టకపోతే తన ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తానని సచిన్ పైలట్ సొంత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ రాజకీయ సంక్షోభాన్ని.. కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. మే 26న రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. కానీ పలు అనివార్య కారణాల వల్ల ఆ సమావేశం వాయిదా పడింది.
మధ్యప్రదేశ్‌లో 150 స్థానాలు గెలుస్తామన్న రాహుల్!
Madhyapradesh Elections : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో 150 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్ర నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ పి. అగర్వాల్ సహా ఆ రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కర్ణాటకలో పార్టీ గెలుపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని రాహుల్ గాంధీ చెప్పినట్లు నేతలు తెలిపారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
"మా మధ్య చాలా సమయం చర్చ జరిగింది. కర్ణాటకలో మెజార్టీ స్థానాల్లో గెలుస్తామని ముందే అంచనా వేశాం. మధ్యప్రదేశ్‌లో కూడా 150 స్థానాల్లో కచ్చితంగా విజయం సాధిస్తాం. కర్ణాటక ఫలితాలే మధ్యప్రదేశ్‌లో కూడా పునరావృతం కానున్నాయి" అని సమావేశం అనంతరం రాహుల్ గాంధీ చెప్పారు. ఈ ఎన్నికల్లో నేతలంతా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని తీర్మానించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రంలోని సమస్యలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు కమల్‌నాథ్ తెలిపారు.