Ashok Gehlot On Bharat Jodo Yatra : రాహుల్‌గాంధీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తెలిపారు. కాంగ్రెస్ తలపెట్టిన భారత్‌జోడో యాత్ర ప్రారంభానికి ముందు మాట్లాడిన ఆయన.. రాహుల్ నాయకత్వంలో తామంతా పనిచేయనున్నట్లు చెప్పారు. దేశం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, రాహుల్ పార్టీ అధ్యక్షుడైతే వాటిని ఎదుర్కోవటం సులభమవుతుందని అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి దేశంలో విద్వేషం, ఉద్రిక్త, హింసాత్మక వాతావరణం నెలకొని ఉందన్న గహ్లోత్.. ఆ పరిస్థితిని పారదోలేందుకు భారత్ జోడో నినాదం ఇవ్వాల్సిన అవసరముందన్నారు. ప్రజల మధ్య ప్రేమ, సోదరభావం, సామరస్యం ఉండాలని.. హింసను సహించబోమని చెప్పాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంతవరకు ఆ పని చేయలేదని రాజస్థాన్ సీఎం విమర్శించారు. కులాలు, మతాల పేర దేశాన్ని విభజిస్తున్నారని.. దీనిని నిలువరించకపోతే అంతర్యుద్దానికి దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించదలచిన 'భారత్ జోడో యాత్ర' బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ వరకు కొనసాగే ఈ పాదయాత్రకు ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ నేతృత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకునేలా, దేశంలో భాజపాయేతర శక్తి బలంగా ఉందని చాటే ఉద్దేశంతో పకడ్బందీ ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. యాత్ర కోసం రాహుల్ గాంధీ మంగళవారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు.