Asha Malviya cyclist : మహిళలపై నేరాలు పెరుగుతుండటాన్ని చూసి చలించిపోయిన ఓ యువతి దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టింది. భారత్‌లో మహిళలు సురక్షితంగానే ఉంటారన్న సందేశం ఇచ్చేందుకు ఒంటరిగా సాహస యాత్ర ప్రారంభించింది. 24 ఏళ్లకే 17,250 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసింది. 21 రాష్ట్రాల మీదుగా ప్రయాణించిన ఆ యువతి.. ముఖ్యమంత్రులు, గవర్నర్లను కలుస్తోంది. తాజాగా అసోం రాజధాని గువాహటికి చేరుకుంది. మహిళల సాధికారతకు కృషి చేయాలన్న లక్ష్యంతో, వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సందేశంతో సైకిల్ యాత్ర చేపట్టినట్లు చెబుతోంది ఆశా మాలవీయ.
సోలో సైక్లిస్ట్ ఆశా మాలవీయ మాలవీయ స్వస్థలం మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లాలోని నాతారామ్ గ్రామం. గతేడాది నవంబర్ 1న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించింది ఆశ. 28 రాష్ట్రాలు చుట్టిరావాలన్న లక్ష్యంతో సైకిల్‌పై బయల్దేరింది. మొత్తంగా 25 వేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తోంది ఆశ. మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసింది. వారి చేతుల మీదుగా సత్కారాలు అందుకుంది. శుక్రవారం గువాహటికి చేరుకున్న ఆశ.. నరేంగి మిలిటరీ స్టేషన్లో మేజర్ జనరల్ ఆర్కే ఝాను కలుసుకుంది.
సోలో సైక్లిస్ట్ ఆశా మాలవీయ ఆ సందేశం ఇచ్చేందుకే..
దేశంలోని కొన్ని వర్గాల మహిళలు ఇప్పటికీ పైకి ఎదగలేకపోతున్నారని ఆశా మాలవీయ చెబుతోంది. తమకు రక్షణ లేదని మెజారిటీ మహిళలు ఫీల్ అవుతున్నారని తెలిపింది. దేశంలోని మహిళలంతా సురక్షితంగా ఉన్నారనే సందేశం ఇచ్చేందుకే 'సంపూర్ణ భారత్ యాత్ర' పేరుతో ఈ సైకిల్ జర్నీ చేపట్టినట్లు వెల్లడించింది.
సోలో సైక్లిస్ట్ ఆశా మాలవీయ "2022 నవంబర్ 1న నేను ఈ జర్నీ ప్రారంభించా. ఇప్పటివరకు 21 రాష్ట్రాల మీదుగా ప్రయాణించా. మహిళల భద్రత, మహిళా సాధికారత నా ప్రయాణ లక్ష్యాలు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని.. ఈ దేశంలో అతివలంతా సురక్షితంగా ఉన్నారనే సందేశం ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పటివరకు నా ప్రయాణం అద్భుతంగా సాగింది."
-ఆశా మాలవీయ, సోలో సైక్లిస్ట్
ఈ యాత్రలో ఇప్పటి వరకు కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను కలిశానని ఆశ తెలిపింది. తానొక పేద కుటుంబంలో జన్మించానని.. అక్క, తల్లితో కలిసి జీవిస్తున్నానని చెప్పింది. మహిళలకు భారత్ సురక్షితమైన ప్రదేశం కాదని విదేశీయులు భావిస్తారని... అయితే తన సైకిల్ యాత్ర ద్వారా ఆ అభిప్రాయాన్ని మార్చాలని సంకల్పించుకున్నానని ఆశ తెలిపింది. దేశవ్యాప్తంగా అలవోకగా వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఆశా మాలవీయ ఓ పర్వతారోహకురాలు కూడా.
సోలో సైక్లిస్ట్ ఆశా మాలవీయ