తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండో తరగతి పాఠాలు చదవలేని 18 ఏళ్ల విద్యార్థులు- ఆందోళనకరంగా ASER-2023 స్టడీ రిపోర్ట్

ASER Report 2023 : దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల చదువు, అభ్యాస స్థితిపై విడుదలైన ఏ.ఎస్​.ఈ.ఆర్​ విద్యా నివేదిక-2023 ఆందోళన రేకెత్తిస్తోంది. 14 నుంచి 18 ఏళ్ల వయస్సున్న విద్యార్థులపై చేపట్టిన ఈ సర్వేలో 25 శాతం మంది తమ ప్రాంతీయ భాషల్లోని పాఠ్యాంశాలను సరిగ్గా చదవలేకపోతున్నారని తెలుస్తోంది. ఇక కొన్ని సబ్జెక్టుల్లో యువకులు మెరుగ్గా ఉండగా మరికొన్నింటిలో యువతులు మెరుగ్గా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది.

ASER Report 2023- Education Report 2023
ASER Report 2023

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 6:39 PM IST

ASER Report 2023 : దేశంలో వార్షిక విద్యా నివేదిక- ఏ.ఎస్​.ఈ.ఆర్​-2023 సమాచారం ఆందోళన కలిగిస్తోంది. 14 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థుల్లో 25 శాతం మంది తమ ప్రాంతీయ భాషల్లో రెండో తరగతి పాఠ్యాంశాలను సరిగ్గా చదవలేకపోతున్నారని తెలుస్తోంది. ఇందులో యువకులతో పోల్చితే యువతులు కాస్త మెరుగ్గా చదువుతున్నట్టు నివేదిక తెలిపింది. మరోవైపు ఈ 25 శాతం విద్యార్థుల్లో అంకగణితంతో పాటు ఆంగ్లంలో యువతులతో పోల్చితే యువకులు మెరుగ్గా ఉన్నట్టు పేర్కొంది.

విద్యా నివేదిక ప్రకారం దేశంలో 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వారిలో 86.8 శాతం కంటే ఎక్కువ మంది పేరు విద్యా సంస్థల్లో నమోదై ఉంది. పదకొండు, పన్నెండు తరగతులకు చెందిన 55 శాతానికి పైగా విద్యార్థులు హ్యుమానిటీస్‌ లేదా ఆర్స్ట్ స్ట్రీమ్‌ను ఎంచుకున్నారని తెలుస్తోంది. మిగతా వారు సైన్స్, కామర్స్‌ను ఎంచుకున్నారని ASER-2023 నివేదిక పేర్కొంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం కోర్సుల్లో యువకుల కంటే యువతులు తక్కువగా నమోదు చేసుకున్నారని నివేదిక వివరించింది. 14 ఏళ్ల వయస్సు వారిలో 3.9 శాతం మంది పేరు ఏ విద్యాసంస్థల్లోనూ నమోదు కాలేదు. 18 అంతకంటే ఎక్కువ వయస్సు వారిలో 32.6 శాతం మంది పేరు ఎక్కడా నమోదు అవ్వలేదు.

ఈసారి వారిపైనే దృష్టి
ఏ.ఎస్​.ఈ.ఆర్​-2023 సర్వేను దేశంలోని 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల్లో నిర్వహించారు. అందులో 14 నుంచి 18 ఏళ్ల వయసున్న 34 వేల 745 మంది విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సర్వేలో భాగంగా దాదాపు అన్ని ప్రధాన రాష్ట్రాల్లోని ఓ గ్రామీణ జిల్లాలో సర్వే నిర్వహించారు. వార్షిక విద్యా నివేదిక-ASER "బియాండ్ బేసిక్స్‌" 2023ని దిల్లీలో అధికారులు విడుదల చేశారు. సాధారణంగా 5 నుంచి 16 సంవత్సరాల విద్యార్థుల చదువు, అభ్యాస స్థితిపై ఈ సర్వే నిర్వహిస్తుండగా, ఈసారి దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని 14 నుంచి 18 సంవత్సరాల యువతపై ఈ సర్వే దృష్టి సారించింది. 2017లోనూ ఈ వయస్సు విద్యార్థులపై సర్వే నిర్వహించారు. 2005లో మొదటిసారిగా ASER సర్వే జరగ్గా ఆ తర్వాత 2014 వరకు ఏటా నిర్వహించారు. 2016 నుంచి పత్యామ్నాయ సంవత్సరాల్లో సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కేవలం 5.6 శాతం మంది యువకులు మాత్రమే వృత్తి నైపుణ్య శిక్షణ పొందడం గానీ లేదా ఇతర సంబంధిత కోర్సుల్లో చేరారని A.S.E.R నివేదిక తెలిపింది. కొవిడ్ మహమ్మారి సమయంలో జీవనోపాధి కోల్పోవడం వల్ల చాలా మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లడం లేదన్నది నిరాధారమైందని నివేదిక తేటతెల్లం చేసింది.

అయోధ్య రాముడికి కలశ పూజ- గర్భగుడిలో హారతి

మరో అయోధ్యను తలపించేలా పూరీలో జగన్నాథ కారిడార్- సీఎం చేతుల మీదుగా గ్రాండ్​ ఓపెనింగ్​

ABOUT THE AUTHOR

...view details