Asaduddin Owaisi news:ఎన్నికల వేళ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిగిన నేపథ్యంలో తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై వాహనంపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్లు అసదుద్దీన్ తెలిపారు. ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడిన ఆయన శనివారం భాగ్‌పత్ జిల్లా ఛప్రౌలిలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. కాల్పుల ఘటన తర్వాత మొదటిసారి ఓ ర్యాలీలో భాగమయ్యారు. ఈ సందర్భంగా దాడి గురించి మాట్లాడారు. అప్పట్లో మహాత్మా గాంధీని చంపినవారే నేడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు.
'ఒకప్పుడు గాంధీని హత్యచేసినవారే నేడు నాపై దాడికి పాల్పడ్డారు' అంటూ ఒవైసీ పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారికి భాజపాతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 'నాపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. కానీ అల్లా నన్ను రక్షించాడు' అని తెలిపారు.