తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'18ఏళ్లకు ప్రధానిని ఎన్నుకోగలిగితే.. పెళ్లి ఎందుకు చేసుకోకూడదు?'

Asaduddin Owaisi: అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లు చేయాలన్న ప్రతిపాదనను విమర్శించారు మజ్లీస్​ నేత అసదుద్దీన్​ ఓవైసీ. 18 ఏళ్ల యువతికి ప్రధానిని ఎన్నుకునే హక్కు ఉన్నప్పుడు వివాహం చేసుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు.

d
d

By

Published : Dec 18, 2021, 10:25 AM IST

Asaduddin Owaisi: అమ్మాయిల కనీస వివాహ వయసు 18 నుంచి 21కి పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్రం అనుమతించడాన్ని తప్పుపట్టారు మజ్లీస్​ పార్టీ అధినేత అసదుద్దీన్​ ఓవైసీ. 18 ఏళ్ల యువతికి ప్రధానిని ఎన్నుకునే హక్కు ఉన్నప్పుడు వివాహం చేసుకునే హక్కు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. మహిళల స్వేచ్ఛను మోదీ ప్రభుత్వం కట్టడిచేస్తోందనడానికి ఇది ఉదాహరణ అని పేర్కొన్నారు.

"దేశంలో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టడానికి కారణం విద్య, ఆర్థిక అభివృద్ధి. చట్టాలు కావు. 18 ఏళ్లులోపే వివాహం అవుతున్న వారి సంఖ్య 1.2 కోట్లు అని ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. మహిళల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. 2005లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు 26 శాతం ఉండగా.. 2020 నాటికి అది 16 శాతానికి చేరుకుంది."

-అసదుద్దీన్​ ఓవైసీ, ఏఐఎంఐఎం అధినేత.

అసెంబ్లీలో పోటీచేసేందుకు యువకులకు ఉండాల్సిన కనీస అర్హతను కూడా 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు చేయాలని సూచించారు ఓవైసీ.

21ఏళ్లు ఉండాల్సిందే..!

ప్రస్తుతం దేశంలో అబ్బాయిల కనీస వివాహ వయసు 21ఏళ్లు, అమ్మాయిల కనీస వివాహ వయసు 18ఏళ్లుగా ఉంది. అయితే, గత కొంతకాలంగా దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరం తొలగించాలని అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మాయిల కనీస వివాహ వయసు తక్కువగా ఉండటం.. వారి కెరీర్‌కు అవరోధంగా మారుతోందనే వాదనలు ఉన్నాయి. అంతేగాక, దీని వల్ల చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అందుకే వివాహానికి అమ్మాయిల కనీస వయసు కూడా 21ఏళ్లకు పెంచాలని పలువురు కోరారు.

ఈ అభ్యర్థనలను పరిగణించిన కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు చేపట్టింది. ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం నుంచి అమ్మాయిలను కాపాడాల్సిన అవసరం ఉందని గతేడాది స్వాత్రంత్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ తెలిపారు. ఇందుకోసం గతేడాది జూన్‌లోనే నీతి ఆయోగ్‌ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. దీనికి జయ జైట్లీ నేతృత్వం వహించగా.. ప్రభుత్వ నిపుణులు డాక్టర్‌ వీకే పాల్‌, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, న్యాయ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు దీనిలో సభ్యులుగా ఉన్నారు.

ఈ టాస్క్‌ఫోర్స్‌ దేశవ్యాప్తంగా సర్వేలు చేపట్టి అభిప్రాయాలు సేకరించింది. వాటన్నింటినీ పరిశీలించి ఇటీవల కొన్ని ప్రతిపాదనలు చేసింది. అమ్మాయిలు తొలి సారి గర్భం దాల్చేనాటికి వారి వయసు కనీసం 21ఏళ్లు ఉండాలని సూచించింది. అంతేగాక, అమ్మాయిలకు 21ఏళ్లకు వివాహం చేయడం అది ఆ కుటుంబంపై ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్య పరంగా సానుకూల ప్రభావం చూపుతుందని టాస్క్‌ఫోర్స్‌ పేర్కొంది. ఈ ప్రతిపాదనలకు తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా త్వరలోనే బాల్య వివాహాల నిరోధక చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టాల్లో సవరణలు తీసుకురావాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి :బెంగళూరులో ఆందోళనలు.. నిరసనకారులపై లాఠీచార్జ్​

ABOUT THE AUTHOR

...view details