తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత్, చైనా మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్ఠంభనను పరిష్కరించుకునే దిశగా మరో అడుగు పడింది. ఇప్పటికే పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఎదురెదురుగా నిలిచిన బలగాలను ఉపసంహరించుకున్న ఇరు దేశాలు గోగ్రా ప్రాంతం వద్ద కూడా అదే బాటలో పయనించాయి. చైనా భూభాగంలో ఉన్న మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద గత శనివారం ఇరు దేశాల కోర్ కమాండర్ల మధ్య 12వ విడత చర్చలు జరిగాయి. దాదాపు 9 గంటల పాటు సాగిన ఈ భేటీలో గోగ్రా హైట్స్ నుంచి బలగాలను వెనక్కి మళ్లించేందుకు ఇరు దేశాలు పరస్పర అంగీకారం తెలిపాయి. ఈ ఒప్పందం మేరకు గోగ్రా ప్రాంతంలో భారత్, చైనా తమ బలగాలను ఉపసంహరించి తమ తమ శాశ్వత స్థావరాలకు చేరుకున్నాయి. సైనిక ప్రతిష్ఠంభన నెలకొన్న ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలను కూలగొట్టాయి.
గత ఏడాది మే నుంచి గోగ్రా ప్రాంతంలో భారత్-చైనా సైన్యాలు ఎదురెదురుగా ఉన్నాయి. ఒప్పందం మేరకు ఇరు దేశాలు దశల వారీగా బలగాల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టాయి. అక్కడ నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించాయి. గత ఏడాది మే నెలకు ముందు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో మళ్లీ అలాంటి స్థితిని నెలకొల్పాయి. యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చరాదని ఇరుపక్షాలు నిర్ణయించాయి. తాజా చర్యలతో మరొక ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లారినట్లు అయ్యింది. పశ్చిమ సెక్టార్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రతిష్టంభన తొలగించే దిశగా సంప్రదింపులు కొనసాగించాలని భారత్-చైనా నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు, శాంతి, సామరస్యాలు నెలకొల్పేందుకు భారత సైన్యం, ఐటీబీపీ కట్టుబడి ఉందని భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.