Arvind Kejriwal ED Summons: ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి జనవరి 18న విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. కేజ్రీవాల్‌కు ఇప్పటికే మూడుసార్లు ఈడీ సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో తమ ఎదుట హాజరు కావాలని దర్యాప్తు సంస్థ నాలుగోసారి ఆయనకు శనివారం ఆదేశాలు జారీ చేసింది.
అంతకుముందు జనవరి 3న మూడోసారి సమన్లు జారీ చేయగా వీటిని అక్రమమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆ సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవిగా ఆరోపించారు. 'బీజేపీ సూచన మేరకే ఈడీ సమన్లు పంపింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నన్ను దూరం చేసేందుకు వీటిని జారీ చేశారు. తక్షణమే సమన్లను ఉపసంహరించుకోవాలి' అని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
కేజ్రీవాల్‌పై బీజేపీ ఫైర్
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నాలుగో సారి సమన్లు జారీ చేయడంపై దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా స్పందించారు. 'అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి భయపడుతున్నారు. అందుకే ఈడీ విచారణకు హాజరుకావట్లేదు' అని వీరేంద్ర సచ్‌దేవా తెలిపారు. మరోవైపు, అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణను తప్పించుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు అని అన్నారు బీజేపీ నేత బన్సూరి స్వరాజ్. ' గతేడాది నవంబర్ నుంచి ఈడీ కేజ్రీవాల్‌కు పలుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ ఎప్పుడూ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని, విపాసన కోసం వెళుతున్నానని సాకులు చెబుతూనే ఉన్నారు. కేజ్రీవాల్ నిజాయితీగా ఉంటే ఈడీ విచారణకు హాజరుకావాలి. చట్టాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి.' బన్సూరి స్వరాజ్ తెలిపారు.