తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఐ విచారణకు అరవింద్​ కేజ్రీవాల్​.. అరెస్ట్​ చేస్తారా? - సీబీఐ విచారణకు కేజ్రీవాల్‌

Arvind Kejriwal CBI : అరవింద్​ కేజ్రీవాల్​ ఆదివారం సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. దిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణానికి సంబంధించి.. సీబీఐ ఆయన్ను ప్రశ్నించనుంది. మద్యం విధానం రూపకల్పనపై కేంద్ర దర్యాప్తు సంస్థ.. దిల్లీ ముఖ్యమంత్రిని విాచారించనుంది.

arvind kejriwal cbi
అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ

By

Published : Apr 16, 2023, 6:49 AM IST

Arvind Kejriwal CBI :దిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఇచ్చిన సమన్ల మేరకు.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం విచారణకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. మద్యం విధానం రూపకల్పనపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరా తీయనుంది. పాలసీకి సంబంధించి మంత్రిమండలి ముందు ప్రవేశపెట్టాల్సిన కీలక దస్త్రం కనిపించకుండాపోవడంపై.. కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించనున్నట్లు సమాచారం. మద్యం పాలసీకి సంబంధించి నిపుణులు, ప్రజలు, న్యాయపరమైన అభిప్రాయలతో కూడిన దస్త్రం దిల్లీ మంత్రిమండలి ముందు ప్రవేశపెట్టకుండానే మాయమైందని సీబీఐ చెబుతోంది. దాని గురించి సీఎంను ప్రశ్నించే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

కొందరు మద్యం వ్యాపారులకు, దక్షిణాది లిక్కర్ లాబీకి అనుకూలంగా.. మద్యం పాలసీ రూపకల్పనలో ప్రభావితం చేసిన ఇతర నిందితుల వాంగ్మూలాలపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పనలో సీఎం కేజ్రీవాల్‌ పాత్రపై.. ఆరా తీయనున్నట్లు సమాచారం. పాలసీని మద్యం వాపారులు, దక్షిణాది లాబీ ప్రభావితం చేసిన విషయం తెలుసా అని ప్రశ్నించే అవకాశమున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. మద్యం పాలసీ ఆమోదానికి ముందే ఈ ప్రక్రియలో పాలుపంచుకున్నారా? అని కూడా అడిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

సీబీఐ కోరినట్లు విచారణకు హాజరవుతానని.. కేజ్రీవాల్ శనివారం చెప్పారు. తనను అరెస్ట్ చేసే అవకాశముందని భాజపా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఒకవేళ సీబీఐకి అటువంటి ఆదేశాలు వచ్చి ఉంటే వారు నిరాకరించే అవకాశాలులేవని కేజ్రీవాల్‌ అన్నారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఫిబ్రవరి 26న అప్పటి దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాను సీబీఐ అరెస్ట్ చేసింది. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న సిసోదియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌-ఈడీ కూడా గతనెలలో అరెస్ట్ చేసింది. మద్యం పాలసీని తమకు అనుకూలంగా దక్షిణాది లాబీ ప్రభావితం చేసినట్లు.. డిజిటల్ ఫోరెన్సిక్ విధానంలో కొన్ని చాటింగ్‌లను సీబీఐ సేకరించింది.

ఇండోస్పిరిట్‌ గ్రూపు పెట్టుకున్న తొలి దరఖాస్తుపై హైదరాబాద్‌కు చెందిన రాజకీయ నాయకులు, మద్యం వాపారులు ఉన్న.. దక్షిణాది లాబీ ఆధిపత్యం చూపినట్లు సీబీఐ గుర్తించింది. గ్రూపు సమర్పించిన.. రెండో దరఖాస్తుపై కొన్ని అభ్యంతరాలు వచ్చినట్లు తెలిపింది. ఐతే.. రెండో దరఖాస్తు ఆధారంగా లైసెన్స్ ఇవ్వాలని సిసోదియా ఎక్సైజ్ అధికారులను సిసోదియా ఆదేశించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. అప్పటికే మరో దరఖాస్తు ఉందనే విషయం ఆయనకు తెలియయకుండా ఉండే అవకాశమే లేదని సీబీఐ పేర్కొంది. ముడుపులు తీసుకుని ఈ నేరాలకు సిసోదియా పాల్పడినట్లు సీబీఐ తెలిపింది.

దిల్లీ మద్యం విక్రయాల్లో కొందరి ఏకపక్ష ఆధిపత్యం కోసం ఎక్సైజ్‌ మంత్రిగా కేబినెట్‌ నోట్‌లో సిసోదియా మార్పులు చేసినట్లు పేర్కొంది. నిందితుడు విజయ్‌ నాయర్‌ దక్షిణాది గ్రూపున తరపున 90 నుంచి 100 కోట్లు ముడుపులు చెల్లించినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు ఆధారాలను కూడా నాశనం చేశారని.. ప్రత్యేక జడ్జి మార్చిలో ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details