Arunachal pradesh china: అరుణాచల్ ప్రదేశ్‌లో మరో 15 ప్రాంతాలకు మరింత ప్రామాణికమైన అధికారిక చైనీస్ పేర్లు పెడుతున్నట్లు చైనా బుధవారం ప్రకటించింది. భారత ఈశాన్య రాష్ట్రమైన ఈ ప్రాంతం తమ భూభాగమని చాలా ఏళ్లుగా వాదిస్తోంది డ్రాగన్ దేశం. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌ను 'జన్‌గ్నాన్' అని చైనీస్ పేరుతోనే పిలుస్తోంది. ఆ రాష్ట్రంలో మరో 15 ప్రాంతాలకు చైనీస్, టిబెటన్, రోమన్ ఆల్పబెట్లతో అధికారిక పేర్లు పెట్టినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. చైనా పౌర వ్యవహారాల శాఖ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసినట్లు చెప్పింది.
ఈ 15 ప్రాంతాల్లో 8 నివాస ప్రాంతాలు కాగా.. 4 పర్వతాలు, రెండు నదులు, ఓ పర్వత మార్గం ఉన్నాయి.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది రెండోసారి. 2017లో కూడా ఇలాగే ఆరు ప్రాంతాలకు తమ అధికారిక పేర్లు పెట్టింది.
అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని వాదిస్తోంది చైనా. భారత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. అది భారత్‌లో అంతర్భాగమని తేల్చి చెప్పింది. అరుణాచల్‌లో భారత నాయకులు పర్యటించిన ప్రతిసారి చైనా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. అది తమ భూభాగమని వితండవాదం చేస్తోంది.