Delhi Liquor Scam Case Updates: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇక ఈ కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి అరుణ్ పిళ్లై ఇప్పటికే అరెస్టు అయ్యారు. ఈ కేసులో అరుణ్ పిళ్లై కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదనలు వినిపించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరితో కలిపి అరుణ్ పిళ్లైను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ కోర్టుకు పేర్కోంది.
Arun Pillai ED custody extension 10 రోజుల కస్టడీలో పిళ్లై ముందు హోటల్ రికార్డ్స్, పత్రాలు ఉంచి విచారణ చేశామని ధర్మాసనానికి వెల్లడించింది. కొందరు నిందితులు, సాక్షులను కలిపి జరుపుతున్న విచారణ ఇంకా పూర్తి కాలేదని కోర్టుకు ఈడీ తెలిపింది. అందుకని ఆ వ్యక్తులను మరోసారి విచారణకు రావాలని ఆదేశించామని స్పష్టం చేసింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇవాళ్టి ఈడీ విచారణకు హాజరుకాలేదని వివరించింది. ఈ పరిస్థితుల్లో అరుణ్ పిళ్లై కస్టడీ పొడిగించాల్సి ఉంటుందని రౌస్ రెవెన్యూ కోర్టుకు ఈడీ పేర్కొంది.
పిళ్లై కస్టడీ పొడిగిస్తే... కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుతో కలిపి ప్రశ్నిస్తామని తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పింది. మార్చి 18న మాగుంటను విచారణకు పిలిచినట్లు వెల్లడించింది ఈడీ. ఇక ఈడీ వాదనలు విన్న రౌస్ రెవెన్యూ కోర్టు... అరుణ్ పిళ్లై ఈడీ కస్టడీని మరో 3 రోజులకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈడీ అరుణ్ పిళ్లై కస్టడీకి 5 రోజులు కోరగా... 3 రోజుల కస్టడీకి ఇచ్చింది కోర్టు.