Article 370 Supreme Court Hearing : జమ్ము కశ్మీర్ ప్రజలంతా కోరుకున్నా ఆర్టికల్-370 రద్దు చేసేందుకు ఎలాంటి వ్యవస్థే లేదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై రెండోరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. ఆ అధికరణాన్ని ముట్టుకునే అవకాశమే లేకపోతే.. రాజ్యాంగ ప్రాథమిక నిర్మానానికి (బేసిక్ స్ట్రక్చర్) మించిన ఓ కేటగిరీని తయారు చేసినట్టు అవుతుంది కదా అని వ్యాఖ్యానించింది. 'జమ్ము కశ్మీర్ రాజ్యాంగ సభ రద్దుతో ఆర్టికల్-370 శాశ్వతత్వం పొందిందా? ఆ ఆర్టికల్ రద్దు చేయడానికి పాటించిన ప్రక్రియ సరైనదేనా అనే ప్రశ్నలు మాత్రమే ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయ'ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో సీజేఐతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు ఉన్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్ నేత మహ్మద్ అక్బర్ లోనే తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్.. రెండో రోజూ తన వాదనలు వినిపించారు. రాజ్యాంగ రచయితలకు, జమ్ము కశ్మీర్ నాటి మహరాజు హరిసింగ్‌కు అప్పట్లో ఓ అంగీకారం కుదిరిందని గుర్తు చేశారు. పాకిస్థాన్ చొరబాటుదారుల సమస్య నేపథ్యంలో కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తికి మద్దతుగా భారత్‌తో విలీన ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చారని గుర్తు చేశారు. దాన్ని రద్దు చేసేందుకు ఎలాంటి ప్రక్రియను అనుసరించలేమని కపిల్ సిబల్ వాదించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది.