Article 370 Supreme Court :జమ్ముకశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. లద్ధాఖ్ కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా కొంత కాలమే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆగస్టు 31న జమ్ముకశ్మీర్, లద్ధాఖ్‌కు కేంద్ర పాలిత హోదాపై వివరణాత్మక ప్రకటన చేస్తామని అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది కేంద్ర ప్రభుత్వం. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపగా.. కేంద్రం ఈమేరకు వాదనలు వినిపించింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన ఏర్పడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ వాదనలు ఆలకించింది. ఈ నేపథ్యంలోనే ఆర్టికల్ 370పై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సుప్రీం కోర్టుకు నివేదించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. జమ్ముకశ్మీర్, లద్ధాక్‌కు ప్రత్యేక హోదాను సమర్థిస్తూ.. ధర్మాసనం ముందు ఆయన వాదనాలు వినిపించారు. "జాతీయ భద్రతతో ముడిపడిన కారణాలతోనే జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించారనే అంశాన్ని మేము ఏకీభవిస్తున్నాం. కానీ ప్రజాస్వామ్యమనేది కూడా చాలా ముఖ్యమైనది." అని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
జమ్ముకశ్మీర్‌లో ఎక్కువ కాలం ఎన్నికలు జరగకుండా ఉండటాన్ని తాము అనుమతించమని సుప్రీం కోర్టు సృష్టం చేసింది. జమ్ము కశ్మీర్, లద్ధాఖ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారో నిర్దిష్ట కాలపరిమితిని తెలపాలని తుషార్ మెహతాను ఆదేశించింది. దీనిపై కేంద్రం నుంచి పూర్తి వివరణతో రావాలని తుషార్ మెహతా, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణికి సూచించింది సుప్రీం కోర్టు.