బంగాల్ మాల్దా జిల్లాలో ఇటీవల పట్టుబడిన చైనా చొరబాటుదారుడిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తమ దేశానికి చెందిన పలు ఏజెన్సీలు.. భారత ప్రభుత్వంలోని రక్షణ శాఖ సహా ఇతర కీలక వెబ్సైట్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. రక్షణ శాఖ, బీఎస్ఎన్ఎల్తో సంబంధం ఉన్న బెంగళూరుకు చెందిన ఓ సంస్థను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాడని అతని కేసును పరిశీలిస్తున్న ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్పారు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా అక్రమంగా దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో హాన్ జున్వే అనే చైనా పౌరుడిని 10 రోజుల కింద.. భద్రతా దళాలు పట్టుకున్నాయి. ఈ కేసును ప్రత్యేక టాస్క్ ఫోర్స్ దర్యాప్తు చేపట్టింది. అతని మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను అన్‌లాక్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.
" చైనా ఏజెన్సీల లక్ష్యాల్లో పలు వైమానిక సంస్థలు కూడా ఉన్నాయి. భారత రక్షణ వ్యవస్థలోని సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే రక్షణ శాఖ పరిధిలోని వెబ్సైట్ల హ్యాకింగ్‌కు యత్నిస్తున్నారు. ఆయా ఏజెన్సీలతో జున్వే సంబంధాలు, భారత్‌లో అతను చేస్తున్న పనులు తెలుసుకునేందుకు ఎస్టీఎఫ్ ప్రయత్నిస్తోంది. అతను ఎక్కడికి వెళ్లాలనుకున్నాడో ఇంకా తెలియరాలేదు. మాల్దాలోని కలియాచక్‌లో అతని కోసం ఎవరో వేచి ఉన్నారని భావిస్తున్నాం. "