Tirupati to Secunderabad Vande Bharat Express: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును త్వరలోనే పట్టాలు ఎక్కించడానికి రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. సికింద్రాబాద్-తిరుపతిల మధ్య ఈ రైలు అందుబాటులోకి రానుందని రైల్వే వర్గాల ప్రాథమిక సమాచారం. నిర్వహణపరమైన ఏర్పాట్లతో అందుకు సిద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే సంబంధిత రైల్వే డివిజన్ల అధికారులకు గురువారం రాత్రి సమాచారం అందించింది. వారంలో ఆరు రోజుల పాటు ఈ ట్రైన్ నడపనున్నట్లు తెలుస్తోంది.
వయా నల్గొండ, గుంటూరు:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 15న ప్రారంభించిన తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రస్తుతం విజయవంతంగా నడుస్తోంది. ఇందులో ప్రయాణించడానికి ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి నిత్యం వేల సంఖ్యలో శ్రీవారి భక్తులతో పాటుగా సాధారణ భక్తులు ప్రయాణిస్తుంటారు. మూడు నాలుగు వారాల ముందు ప్రయత్నిస్తే తప్ప రిజర్వేషన్ దొరకని పరిస్థితి.
ప్రయాణికుల నుంచి డిమాండ్ భారీగా ఉండటంతో రైల్వే శాఖ సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కాజీపేట-విజయవాడ, నల్గొండ-గుంటూరు, మహబూబ్‌నగర్-కర్నూలు, వికారాబాద్-తాండూరు-రాయచూరు.. ఇలా నాలుగు మార్గాల్లో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. దీంతో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నల్గొండ-మిర్యాలగూడ-గుంటూరు మార్గంలో నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయానికి వచ్చింది.
Secunderabad to Tirupati Vande Bharat Express: ఇకపోతే రైలు ఏయే స్టేషన్లలో ఆగుతుంది.. ఛార్జీలు, ప్రయాణ సమయంపై స్పష్టత రావాల్సి ఉంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మాత్రం ఏప్రిల్ 8న ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్‌లో ప్రారంభించిన నేపథ్యంలో రెండోదానిని తిరుపతిలో ప్రారంభించడానికి రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది.