భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తి సంవత్సరం దాటినా ఇంకా పరిస్థితిలో మార్పు రాలేదు. తూర్పు లద్దాఖ్‌కు సమీపంలో చైనా ఎయిర్‌బేస్ వద్ద ఆ దేశ సైన్యం 20కి పైగా యుద్ధవిమానాలతో విన్యాసాలు నిర్వహించినట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ అభ్యాసాలను తాము జాగ్రత్తగా గమనించినట్లు పేర్కొన్నాయి.
"దాదాపు 21-22 చైనా యుద్ధవిమానాలు భారత భూభాగమైన తూర్పు లద్దాఖ్‌కు ఎదురుగా అభ్యాసాలు నిర్వహించాయి. వీటిలో ప్రధానంగా జే-11, జే-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. అని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
హోటన్, గర్ గన్సా, కష్గర్ ఎయిర్‌బేస్‌లలో ఇటీవల చైనా వాయిసేన కార్యకలాపాలను పెంచిందని అధికారిక వర్గాలు తెలిపాయి. అన్ని రకాల యుద్ధ విమానాలతో అభ్యాసాలు నిర్వహిస్తోందని పేర్కొన్నాయి. ఈ ఎయిర్‌బేస్‌లో ఎన్ని ఫైటర్ జెట్లు ఉన్నాయో తెలిసే అవకాశం లేకుండా చైనా ఏర్పాట్లు చేసుకున్నట్లు వివరించాయి.
అయితే చైనా యుద్ధవిమానాలు ఆ దేశ సరిహద్దులోనే ఉన్నాయని, భారత భూభాగంలోకి ప్రవేశించలేదని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.