పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని లాంచ్ ప్యాడ్ల వద్ద 400మంది ముష్కరులు భారత్‌లోకి ఎప్పుడు చొరబడుదామా అని ఎదురుచూస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. శీతాకాలంలో భారీగా మంచు కురుస్తున్నప్పటికీ జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు వారు ప్రయత్నిన్నట్లు పేర్కొన్నాయి. అయితే భద్రతా దళాల పటిష్ఠ నిఘా, చొరబాటు వ్యతిరేక చర్యల కారణంగా పాకిస్థాన్ ఉసిగొల్పుతున్న ముష్కరులు భారత్‌లోకి ప్రవేశించలేకపోతున్నారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
2020లో జమ్ముకశ్మీర్ సరిహద్దు వెంబడి 44 చొరబాటు ఘటనలు జరిగాయి. 2019లో ఆ సంఖ్య 141గా ఉంది. 2018లో 143 మంది ముష్కరులు కశ్మీర్లోకి అక్రమంగా ప్రవేశించారు.
సరిహద్దు వెంబడి కీలక మార్గాలను మూసివేయడం, చొరబాటు నిరోధక చర్యలు చేపట్టడం వల్ల ఈ సారి పాక్ ఉగ్రవాదుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో కాల్పుల విరమణ పదే పదే ఉల్లంఘించింది దాయాది దేశ సైన్యం. 2003నుంచి ఎన్నడూ లేని స్థాయిలో 2020లో ఏకంగా 5,100 సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడింది. మోర్టార్ షెల్స్ విసిరి, కాల్పులు జరపడం ద్వారా ఉగ్రవాదులను కశ్మీర్‌లోని పంపే కుట్రలు చేసింది.
జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపి ప్రశాంత వాతావరణాన్ని హింసాత్మకంగా మార్చేందుకు పాక్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రస్తుతం 300 నుంచి 415 మంది ముష్కరులు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పీర్ పంజల్ లోయ ఉత్తర భాగంలో 175-210 మంది, దక్షిణ భాగంలో 119-216 మంది ముష్కరులు ఉన్నట్లు తెలిపాయి. సొరంగ మార్గాల ద్వారా ఉగ్రవాదులను ఆయుధాలు, పేలుడు పదార్థాలతో కశ్మీర్లోకి పంపేందుకు పాక్ విశ్వప్రయత్నాలు చేస్తోంది.