తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నియంత్రణ రేఖ వద్ద 250 మంది ఉగ్రవాదులు.. భారత్​లో చొరబాటుకు యత్నం! - jammu and kashmir terror attacks

భారత్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి సుమారు 250 మంది ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. నియంత్రణ రేఖ వెంబడి గస్తీని ముమ్మరం చేసింది.

Around 250 terrorists waiting across LoC, army gears up to counter
Around 250 terrorists waiting across LoC, army gears up to counter

By

Published : Sep 7, 2022, 6:53 AM IST

భారత్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి సుమారు 250 మంది ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రస్తుతం వీరంతా పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని పలు లాంచ్‌ ప్యాడ్‌ల వద్ద మోహరించినట్టు పేర్కొంది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. నియంత్రణ రేఖ వెంబడి గస్తీని ముమ్మరం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా తిప్పికొట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కశ్మీర్‌ ఉత్తరభాగంలోని కేరన్‌ పోస్టు వద్ద నిఘాను తీవ్రం చేసింది. శత్రువులతో పోరాడుతున్న సైనికులకు ఇప్పుడిప్పుడే శీతకాల ప్రభావం కూడా ఎదురవుతోంది.

చలిగాలులు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గినా, మాదక ద్రవ్యాలు మాత్రం భారీగానే దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నట్టు సైనిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. డ్రగ్స్‌ ద్వారా సంపాదించిన డబ్బులతో పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, దీన్ని నియంత్రించేందుకు గట్టి కృషి చేస్తున్నామని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ చెప్పారు. ఉగ్రవాదులే కాకుండా, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు భారత్‌లోకి చొరబడకుండా సరిహద్దుల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు.

బీఎస్‌ఎఫ్‌ బలగాలపై పాక్‌ రేంజర్ల కాల్పులు
కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్‌ మరోసారి తూట్లు పొడిచింది. పాక్‌ రేంజర్లు మంగళవారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆర్నియా సెక్టార్‌ వద్ద భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. అయితే, దీనికి తమ బలగాలు గట్టి సమాధానం ఇచ్చినట్టు బీఎస్‌ఎఫ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీఎస్‌ సంధూ తెలిపారు. ఉభయపక్షాల మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగినా, భారతీయులెవరికీ ప్రాణనష్టం సంభవించలేదని వివరించారు. ఘటన జరిగిన వెంటనే సీనియర్‌ అధికారులు సరిహద్దు సమీపంలోని చినాజ్‌ ఔట్‌పోస్ట్‌ వద్దకు చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు.

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరుల హతం
జమ్మూ-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడి పోష్కీరిలో ముష్కరులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతాదళాలు మంగళవారం ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఎదురుకాల్పులు జరిపినట్లు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు మృతి చెందారని.. వారి వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:బెంజి కారులో వచ్చి రేషన్ తీసుకెళ్లిన 'పేదవాడు'.. వీడియో వైరల్

షాకింగ్​ వీడియో.. మహిళ మీద నుంచి దూసుకెళ్లిన వాటర్​ ట్యాంకర్.. అక్కడికక్కడే..​

ABOUT THE AUTHOR

...view details