Arogya Mitra Employees Demands:ఆరోగ్యమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాకా, ఏదో మొక్కుబడిగా వేతనాలు పెంచి చేతులు దులుపుకున్నారు. పైగా జీతాలు గీతదాటాయంటూ సంక్షేమ పథకాలకు కోత పెట్టారు. బండెడు చాకిరీ చేయిస్తున్నారు. మాట తప్పిన మడమ తిప్పిన జగనన్న పుణ్యమా అని, క్రమబద్ధీకరణ కాక, వేతనాలు సరిపోక అటు సంక్షేమ పథకాలూ అందక కష్టాలతో అల్లాడిపోతున్నారు.
జనవరి 21, 2016న నెల్లూరులో ప్రతిపక్షంలో ఉండగా తనను కలిసిన ఆరోగ్యమిత్రలకు ఉద్యోగాల క్రమబద్ధీకరణపై జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది 'ఓడ దాటేదాక ఓడ మల్లన్న' ఓడ దాటాక బోడి మల్లన్న' అన్నట్లుగా జగనన్న ఆరోగ్యమిత్రలకు ఇచ్చిన హామీని గాలికొదిలేశారు. పదవీకాలం ముగిసి, మళ్లీ ఎన్నికలు జరగబోతున్నా ఆరోగ్యమిత్ర ఉద్యోగ భద్రతపై నోరు మెదపడం లేదు. మాటలకు చేతలకు పొంతనలేని జగనన్న పుణ్యమా అని. అరకొర వేతనాలతోనే వారు కాలం వెళ్లదీస్తున్నారు. ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ అధికారులకు పదేపదే విజ్ఞాపనపత్రాలు అందచేస్తున్నారు. సీఎంను కలుసుకునేందుకూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని హెచ్చరిక- ఇకపై ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు ఉండవా?
'ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ అనుబంధ ఆసుపత్రుల్లో ఆరోగ్యమిత్రలు పనిచేస్తున్నారు. డిగ్రీ అర్హతతో ఆహ్వానించిన దరఖాస్తుల మేరకు జిల్లాల్లో రాత పరీక్ష రాసి జిల్లా కమిటీల ద్వారా ఉద్యోగాలు చేస్తున్నారు. అనుబంధ ఆసుపత్రుల యాజమాన్యాలు, రోగులు, ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయం మధ్య అనుసంధానంగా పనిచేసే వారికి మాత్రం ఉద్యోగ భద్రతలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2వేల 500 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం నెలకు వచ్చే 15వేల చాలీచాలని జీతంతోనే జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకుంటున్నాం.' ఎ.వి.నాగేశ్వరరావు, కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘం నేత