Army Vehcles Attacked Search Operation: సైనిక బలగాల వాహనాలపై దాడికి పాల్పడిన ముష్కరులను మట్టుబెట్టేందుకు జమ్ము కశ్మీర్ పూంచ్ జిల్లాలో సైనిక బలగాలు ముమ్మరంగా వేట సాగిస్తున్నాయి. భారీ ఎత్తున అదనపు బలగాలను మోహరించి ముష్కరుల కోసం వెతుకుతున్నాయి. స్నిఫర్ డాగ్‌లను రంగంలోకి దించి తీవ్రవాదుల జాడ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హెలికాప్టర్లతో పైనుంచి అటవీ ప్రాంతంపై నిఘా పెట్టారు. మొత్తం ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన సైనిక బలగాలు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నాయి. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నాయి. ధీర్ కి గలి రోడ్డులో ట్రాఫిక్‌ను నిలిపివేసిన సైన్యం ముష్కరుల కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
తీవ్రవాదులు దాడి చేసిన ప్రాంతానికి చేరుకున్న 16 కోర్ జనరల్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్ ఆపరేషన్ జరుగుతున్న తీరును సమీక్షించారు. NIA అధికారులు సైతం తీవ్రవాద దాడి జరిగిన స్థలాన్ని పరిశీలించారు. గురువారం సాయంత్రం 3 గంటల 45 నిమిషాలకు పూంచ్ జిల్లాలోని రాజౌరి సెక్టార్‌లో ధీర్ కి గలి, బుఫ్లియాజ్ ప్రాంతాల మధ్య ఒక మలుపులో రెండు సైనిక వాహనాలపై ముష్కరులు ఆకస్మిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. దాడిలో ఉగ్రవాదులు అమెరికాలో తయారైన రైఫిల్‌ను వాడినట్లు తెలుస్తోంది.
ఉగ్రదాడి నేపథ్యంలో ముష్కరుల వేట కోసం సైన్యం అదనపు బలగాలు తరలించింది. ముగ్గురు, నలుగురు ముష్కరులు కొండపై నుంచి బ్లైండ్ స్పాట్‌గా భావిస్తున్న మలుపు వద్ద దాడికి తెగబడినట్లు అధికారులు భావిస్తున్నారు. చనిపోయిన సైనికుల మృతదేహాలను ఛిద్రం చేసిన ముష్కరులు వారి వద్ద ఉన్న కొన్ని ఆయుధాలను తీసుకుని పరారైనట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనను వివిధ రాజకీయ పార్టీలు ఖండించాయి.