తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూలిన ఆర్మీ హెలికాప్టర్​.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

జమ్ము కశ్మీర్​లో ఆర్మీ సైనికులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు.

army helicopter crash today
army helicopter crash today

By

Published : May 4, 2023, 12:09 PM IST

Updated : May 4, 2023, 4:49 PM IST

జమ్ము కశ్మీర్​లో ఆర్మీ హెలికాప్టర్​ కూలగా.. ఒకరు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. కిష్త్వార్ జిల్లాలో సైన్యానికి చెందిన ALH ధ్రువ్‌ చాపర్‌.. ప్రమాదానికి గురై మరువా నది ఒడ్డున నేలను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో పైలట్​, కో పైలట్, టెక్నీషియన్​ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుల్ని ఉధంపుర్​లోని ఆస్పత్రికి తరలించాయి. అయితే.. తీవ్రంగా గాయపడిన టెక్నీషియన్.. కాసేపటికి మరణించారు. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
హెలికాప్టర్​లో సాంకేతిక సమస్య తలెత్తిందని, ముందస్తుగా ల్యాండింగ్ చేస్తున్నామని పైలట్లు ముందుగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్​- ఏటీసీకి సమాచారం ఇచ్చినట్లు సైనికి వర్గాలు తెలిపాయి. అయితే.. పర్వత ప్రాంతం, నది ఒడ్డున కావడం వల్ల ఇలా హార్డ్ ల్యాండింగ్ జరిగిందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది.

ఆర్మీ హెలికాప్టర్​ కూలి ఇద్దరు మృతి
ఇటీవలే భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్​ కూడా కుప్పకూలింది. మార్చి 16న అరుణాల్ ప్రదేశ్​లోని మండలా పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్​లో ఉన్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మరణించిన పైలట్లను లెఫ్ట్​నెంట్​ కల్నల్​ వీవీబీ రెడ్డి, మేజర్​ ఎ. జయంత్​గా గుర్తించారు. అయితే లెఫ్టెనెంట్​ కల్నల్ వీవీబీ రెడ్డి.. తెలంగాణలోని యాదాద్రి జిల్లాకు చెందినవారుగా తెలిసింది. ఆయన భార్య కూడా ఆర్మీలోనే దంత వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్ననట్లు సమాచారం. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నామని చెప్పారు. మండలా పర్వత ప్రాంతంలో తూర్పు బంగ్లాజాప్ గ్రామ సమీపంలో విమాన శకలాలు లభించినట్లు చెప్పారు.

అధికారుల సమాచారం ప్రకారం..
మార్చి 16న ఉదయం 9.15కు భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ బోమ్డిలా ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్​తో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన హెలికాప్టర్​లో ఓ సీనియర్​ ఆఫీసర్​, పైలట్​ సహా ఇతర సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. దిరంగ్ నుంచి 100 కి.మీ దూరంలో మండలా వైపుగా పొగను చూసినట్లు స్థానికులు చెప్పారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాతంలో బంగ్లాజాప్ గ్రామస్థులు.. హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైనట్లు దిరంగ్ పోలీసులకు సమాచారం అందించారని వారు వివరించారు.

2022 మార్చిలో కూలిన చీతా హెలికాప్టర్​..
జమ్ముకశ్మీర్​లోని గురేజ్​ సెక్టార్​లోని బారౌమ్​ ప్రాంతంలో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్​ కూలింది. ఈ ఘటనలో కో-పైలట్​ ప్రాణాలు కోల్పోగా.. పైలట్​ గాయాలతో బయటపడ్డారు. ఘటనలో మేజర్ సంకల్ప్​ యాదవ్​ (29) తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2015 నుంచి సంకల్ప్​ యాదవ్​ సైన్యానికి సేవలు అందిస్తున్నారు. సమీపాన ఉన్న ఓ స్థావరం వద్ద అనారోగ్యంతో బాధపడుతున్న సైనికుడిని తరలించేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. గుజ్రాన్​ ప్రాంతం వద్దకు హెలికాప్టర్​ చేరుకున్న తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్​తో సంబంధాలు తెగిపోయాయి. హిమపాతం తీవ్రంగా ఉన్న బందిపోరాలోని గుజ్రన్​ నల్లాహ్​ ప్రాంతంలో హెలికాప్టర్​ శకలాలు కనిపించాయి.

ఇవీ చదవండి :మణిపుర్​లో హింస.. రంగంలోకి సైన్యం.. కేంద్రం అలర్ట్

పెళ్లికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని 11 మంది మృతి

Last Updated : May 4, 2023, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details