Bipin Rawat passed away: తమిళనాడు కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య మధులిక కూడా చనిపోయారు. ఈ మేరకు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది.
సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో రావత్ దంపతులతో పాటు మరో 11 మంది మరణించారు. ఇందులో ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ప్రమాదంలో గాయపడిన పైలట్ 'గ్రూప్ కెప్టెన్' వరుణ్ సింగ్.. వెల్లింగ్టన్లోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మంటల్లో కాలుపోతున్న హెలికాప్టర్ గురువారం సాయంత్రానికి దిల్లీకి..
సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఆర్మీ అధికారుల పార్థివ దేహాలు గురువారం సాయంత్రానికి దిల్లీకి చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
లెక్చర్ ఇచ్చేందుకు వెళ్లి..
కోయంబత్తూర్ సమీపంలోని సూలూర్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన Mi-17V5 చాపర్.. కూనూర్ సమీపంలోని కట్టేరి- నాంచప్పనంచథ్రం వద్ద మధ్యాహ్నం 12.20-12.30 గంటల ప్రాంతంలో కూలిపోయింది.
జనరల్ రావత్.. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ స్టాఫ్ కాలేజ్‌లో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పొగమంచుతో వెలుతురు సరిగా లేకపోవడమే.. ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
చాపర్.. నివాస ప్రాంతాలకు కాస్త దూరంగా కూలిపోవడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది. ఘటన సంబంధిత దృశ్యాలు.. భయానకంగా ఉన్నాయి. హెలికాప్టర్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది.
విచారణకు ఆదేశం..
అంతకుముందు ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో జనరల్ బిపిన్ రావత్ ఉన్నట్లు ప్రకటించిన భారత వాయుసేన.. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది.
రావత్ ఇంటికి రాజ్‌నాథ్, నరవణే..
ఘటనా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ప్రమాదం గురించి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. అనంతరం రక్షణ మంత్రి.. సీడీఎస్ నివాసానికి వెళ్లారు. సైన్యాధిపతి ఎంఎం. నరవణే కూడా జనరల్ రావత్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ప్రత్యక్ష సాక్షి మాటల్లో..
చాపర్ ఓ చెట్టును ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షి కృష్ణకుమార్ ఈటీవీ భారత్‌తో చెప్పారు. ఒక్కసారిగా దట్టమైన పొగ అలుముకొందని, మంటలు చెలరేగాయని వివరించారు. అందులోనుంచి కాలినగాయాలతో కొందరు బయటికిరావడం చూశానని వెల్లడించారు. ఆయనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.
సమాచారం అందిన వెంటనే సైనిక, పోలీసు బృందాలు సహా స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయ చర్యలు చేపట్టారు. స్థానికులు బకెట్లతో నీళ్లు తీసుకొచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బాధితులను ఆస్పత్రులకు తరలించారు.
ఇదీ చూడండి:యుద్ధవీరుడు, త్రిదళాధిపతి.. అసలెవరీ బిపిన్ రావత్?