Army Chief Naravane: తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ భారత సైనిక దళాధిపతి ఎం.ఎం.నరవణె ఆ దేశానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. దిల్లీలో సైనిక దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. సరిహద్దుల వద్ద యథాతథ స్ధితిని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నాన్నీ భారత సైన్యం సఫలం కానివ్వబోదని స్పష్టం చేశారు. చైనాతో సరిహద్దు వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించిన నరవణె.. గత ఏడాది భారత సైన్యం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందని తెలిపారు. తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులను నియంత్రణలో ఉంచేందుకు ఇటీవల సైనిక అధికారుల స్థాయి 14వ విడత చర్చలు జరిపినట్లు వివరించారు.
పొరుగుదేశం పాకిస్థాన్ భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహించేందుకు ఇంకా ప్రయత్నాలు సాగిస్తోందని మండిపడ్డారు నరవణె. సరిహద్దుల ద్వారా కశ్మీర్లోకి చొరబడేందుకు 300-400 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.