సరిహద్దు వివాదంపై చైనాతో జరిగే ప్రతి చర్చలో సానుకూల ఫలితాలను భారత్ ఆశించకూడదని ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణె తెలిపారు(india china border news). చర్చలు సాగుతున్నంత కాలం.. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు నెమ్మదిగా తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. భారత్-చైనా మధ్య జరిగిన 13వ దఫా చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు(india china news).
"సరిహద్దు విషయంలో భారత్-చైనా మధ్య 4-5 అంశాల్లో విభేదాలుండేవి. వాటిల్లో ఒక్కటి తప్ప మిగిలినవి పరిష్కరిచుకున్నాం. రానున్న చర్చల్లో ఆ ఒక్క సమస్య కూడా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాము. కానీ దానికి ఎన్ని దఫాల చర్చలు అవసరమనేది నేను కచ్చితంగా చెప్పలేను. అయితే తూర్పు లద్ధాఖ్‌లో పరిస్థితులు మునుపటి కన్నా మెరుగ్గా ఉన్నాయి. నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. ప్రతి చర్చలోనూ ఫలితాలు మనకు అనుకూలంగా రావాలి అని ఆశించకూడదు. ఏదో ఒక చోట విభేదాలు తలెత్తుతాయి. చర్చలు సాగినంత కాలం, ఆ విభేదాలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుంది."
-- ఎమ్ఎమ్ నరవణె, ఆర్మీ చీఫ్.
భారత్-చైనా మధ్య గతేడాది మే నెల నుంచి సరిహద్దు వివాదం కొనసాగుతోంది. 12 దఫాల చర్చల్లో ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఇరువైపులా అధికారులు కృషి చేశారు. అయితే అక్టోబర్ 11న 13వ దఫా చర్చల్లో పురోగతి లభించలేదు. తాము ఇచ్చిన నిర్మాణాత్మక సూచనలను చైనా అధికారులు అంగీకరించలేదని భారత సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.