ఝార్ఖండ్‌కు చెందిన ఓ రైతును సైన్యం ఆశ్చర్యంలో ముంచెత్తింది. పండించిన పంటను ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతుకు.. పూర్తి మార్కెట్ ధర చెల్లించి ఉత్పత్తుల్ని తీసుకెళ్లింది. అంతేకాకుండా కొందరు సైనికులు రైతు పొలానికి కుటుంబంతో కలిసి వెళ్లి.. కానుకలు అందించారు.
ఏం జరిగిందంటే?
కరోనా కట్టడికి ఝార్ఖండ్‌లో విధించిన లాక్డౌన్ వల్ల రంజన్ కుమార్ మాహ్తో అనే యువరైతు తన పుచ్చకాయ పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో ఐదు టన్నుల పుచ్చకాయలను రామ్‌గఢ్‌లోని సిక్కిం రెజిమెంటల్ సెంటర్(ఎస్ఆర్సీ) సైనికులకు ఉచితంగా అందజేయాలని నిర్ణయించుకున్నాడు.
"లాక్డౌన్లో పంట కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. పంట కుళ్లిపోయే స్థితికి చేరుకుంటోంది. గ్రామంలో కేజీ రెండు రూపాయలకు కూడా ఎవరూ కొనట్లేదు. వివిధ కేంద్రాల సహాయం కోరాం. అయినా స్పందన లేదు. చివరకు ఈ పంటనంతా సైనికులకు ఉచితంగా అందించాలని నిర్ణయించి కంటోన్మెంట్ అధికారులను సంప్రదించాను."