Agnipath recruitment new age limit: 'అగ్నిపథ్' పేరిట 17.5 నుంచి 21 ఏళ్ల వారు సైన్యంలో చేరి నాలుగేళ్ల పాటు సేవలు అందించే అవకాశం కల్పిస్తూ ఇటీవల కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే ఈ ఏడాది నియామకాలకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. అగ్నిపథ్‌పై దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం కాగా పలువురు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఎవరెవరు ఏమన్నారంటే..
అగ్నిపథ్ పథకంలో భాగంగా ఈ ఏడాది చేరే అభ్యర్థులకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే. కరోనా కారణంగా గత రెండేళ్లలో సైన్యంలో చేరే అవకాశం రానివారికి ఈ నిర్ణయం ఉపశమనం కలిగించినట్లు అయిందన్నారు.
"డిసెంబరు 2022లో మొదటి బ్యాచ్ అగ్నివీరులకు శిక్షణ ప్రారంభిస్తాం. 2023 జూన్ లేదా జులైలో వీరికి బాధ్యతలు అప్పగిస్తాం. ఈ నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. త్వరలోనే రిజిస్ట్రేషన్ మొదలైన అంశాలపై షెడ్యూల్ ప్రకటిస్తాం."
-మనోజ్ పాండే, ఆర్మీచీఫ్
"ఈ ఏడాది జరిగే అగ్నిపథ్ నియాకాల్లో అభ్యర్థులకు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇది యువతకు మేలు చేస్తుంది. వాయుసేనలో అగ్నిపథ్ నియమకాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి."
-వీఆర్ చౌదరి, ఎయిర్‌ఫోర్స్ చీఫ్
"అగ్నిపథ్ పథకం దేశ రక్షణ వ్యవస్థలో భాగం కావడానికి, దేశ సేవ చేయడానికి యువతకు ఒక సువర్ణావకాశం. గత రెండేళ్లలో నియామకాలు చేపట్టని కారణంగా సైన్యంలో చేరాలనుకున్నవారికి అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలో యువకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్నివీరుల నియామకానికి ఈ ఏడాది వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచారు. ఈ మినహాయింపు ఒకసారికి మాత్రమే. దీనివల్ల అనేక మంది అగ్నివీరులుగా మారేందుకు అర్హత లభిస్తుంది. ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రికి యువకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది. వెంటనే యువకులంతా అందుకు సన్నద్ధం కావాలని కోరుతున్నాను'.
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి
"యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వయోపరిమితిని పెంచాము. ఈ నిర్ణయం దేశ సేవ చేసి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటున్న యువకులకు లాభం చేకూరుస్తుంది. గత రెండేళ్లు సైన్యంలోని నియామకాలపై కరోనా ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో యువతను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు."
-అమిత్ షా, హోంమంత్రి
క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే అగ్నిపథ్ అమలుపై తుది నిర్ణయం తీసుకున్నామన్నారు రక్షణ శాఖ సహాయక మంత్రి అజయ్ భట్. 'అగ్నిపథ్'పై జరుగుతున్న దుష్ప్రచారాలను యువత నమ్మద్దని సూచించారు. నాలుగేళ్ల తర్వాత ఉత్తీర్ణులు కాని వారికి కూడా ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
అగ్నిపథ్‌పై రక్షణశాఖ సహాయక మంత్రి అజయ్ భట్ "బాగా చర్చించే అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టాము. ఇందులో చేరిన వారికి నాలుగేళ్ల పాటు శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన వారిలో 25 శాతం మందిని సైన్యంలో చేర్చుకుంటాం. మిగతా 75 శాతం మందికి కూడా చాలా విభాగాల్లో అవకాశాలు ఉన్నాయి. ఉత్తీర్ణులు కాని అగ్నివీరులకు తాము ఉపాధి కల్పించనున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కాబట్టీ.. నాలుగేళ్ల తర్వాత భవిష్యత్తు ఏంటని ఎవరూ చింతించాల్సి అవసరం లేదు. బయట జరుగుతున్న దుష్ప్రచారాలను యువత నమ్మద్దు."
-ఈటీవీ భారత్ ముఖాముఖిలో రక్షణ శాఖ సహాయక మంత్రి అజయ్ భట్
మోదీకి అవేం వినిపించవు: ప్రధాని నరేంద్రమోదీకి ప్రజల విజ్ఞప్తులు వినిపించవని.. కేవలం ఆయన స్నేహితుల మాటలే వినిపిస్తాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అగ్నిపథ్ పథకం తొలి ఏడాదికి వయోపరిమితిని 23 ఏళ్లు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుుకన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. "అగ్నిపథ్‌ను యువత, సాగు చట్టాలను రైతులు, నోట్ల రద్దును ఆర్థిక వేత్తలు, జీఎస్టీని వ్యాపారులు వ్యతిరేకించారు." అని రాహుల్ పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రియాంక గాంధీ. కేంద్రం హడావుడిగా ఈ పథకాన్ని అమలులోకి తెచ్చిందని.. ఇది ఉపసంహరించుకుని ఇంతకుముందులానే నియామక ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
ఇదీ చూడండి :ఆరు రోజుల్లో 1400 వెబ్సైట్లు హ్యాకింగ్.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక