నియంత్రణ రేఖ వద్ద శాంతి స్థాపనే లక్ష్యంగా భారత్, పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి కాల్పుల విరమణ ఒప్పందాలకు తూచా తప్పకుండా కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. రెండు దేశాల సైన్యాల డైరక్టర్ జనరళ్ల స్థాయి చర్చల్లో ఈమేరకు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
ఇటీవలి కాలంలో.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు, హింస పెరిగిన నేపథ్యంలో ఇరు దేశాల సైన్యాలు ఈ అంశంపై చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
"నియంత్రణ రేఖ వెంబడి చేసుకున్న ఒప్పందాలు, కుదిరిన అవగాహనలను కచ్చితంగా పాటించాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. గురువారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అదే సమయంలో నియంత్రణ రేఖ వెంబడి అన్ని విభాగాలపై స్వేచ్ఛగా, పరస్పర సహకారంతో ఇరు పక్షాలు సమీక్ష నిర్వహించాయి."
--- భారత్-పాక్ రక్షణ విభాగాల సంయుక్త ప్రకటన
శాంతికి భంగం కలిగించి, హింసకు దారితీసే సమస్యలను పరిష్కరించుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటనలో పేర్కొన్నాయి భారత్-పాక్. సరిహద్దులో పరస్పర లబ్ధికి ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.
అయితే ఉగ్రవాద వ్యతిరేక చర్యలు కొనసాగుతాయని భారత సైన్యం స్పష్టం చేసింది. సరిహద్దు వెంబడి.. పాక్ సైన్యం సహాయంతో జమ్ముకశ్మీర్‌లోకి చొరబడుతున్న వారిని అడ్డుకుంటామని పేర్కొంది.
ఇదీ చూడండి:-ముందు మీ పని చూసుకోండి: పాక్‌కు భారత్ చురకలు