Arjitha Seva and Abhishekam Cancelled at Srisailam During karthika Masam: హిందువులకు కార్తిక మాసం అత్యంత పవిత్రమైనది. దీపావళి తరువాతి రోజు నుంచీ మొదలయ్యే కార్తికానికి ఎంతో ప్రత్యేకత ఉంది. చంద్రుడు పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు కార్తికమనే పేరు వచ్చింది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఎవరిని పూజించినా ఇద్దరూ సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నెలలో చేసే జపం, ధ్యానం, నదీస్నానం, దానం, ఆరాధనతో సకల శుభాలూ కలుగుతాయి. కార్తిక సోమవారాలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.
శివకేశవులను ఆరాధించే ఈ పవిత్ర మాసంలో ఆధ్యాత్మిక క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతారు. ముఖ్యంగా శివాలయాలకు, శైవక్షేత్రాల్లో శివయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శివ క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒక్కటైనా శ్రీశైలానికి అధిక సంఖ్యలో భక్తులు వెళ్తారు. అయితే కార్తికమాస పర్వదినాలు, సెలవు రోజులలో భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంటుందని ముందస్తు ఆలోచనతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
కార్తిక పౌర్ణమి.. ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రం
Karthika Masam Brahmotsavam 2023: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తిక మాసమంతా అభిషేకాలు రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ నెల 14 నుంచి డిసెంబరు 12 వరకు కార్తిక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పర్వదినాలు, సెలవు రోజుల్లో అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాలు కల్పించేందుకు కార్తిక మాసంలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలు, వృద్ధ మల్లికార్జునస్వామి ఆర్జిత, అభిషేకాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.